Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుర సమరంలో 50 శాతమే పోలింగ్
- గతం కంటే క్షీణించిన ఓటింగ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఓటర్లు ముఖం చాటేశారు. ఢిల్లీ మహానగర పురపాలక సంస్థ (ఎంసిడి) ఎన్నికల్లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన పోలింగ్‌లో 50 శాతం మంది ఓటర్లే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకే పోలింగ్ ముగియాల్సి వున్నా పలు చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అందువల్ల ఓటింగ్ శాతం పెరగవచ్చునని పేర్కొన్నారు. అయితే గత రెండు ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌తో పోలిస్తే ఆదివారం నమోదైన పోలింగ్ శాతం తక్కువగా ఉంది. 2017లో 53.55 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 వరకు 18 శాతం పోలింగ్ నమోదు కాగా 2.30 గంటలకు 30 శాతానికి పెరిగిందనీ, సాయంత్రం 4 గంటల సమయంలో 45 పోలింగ్ నమోదు కాగా పోలింగ్ ముగింపు సమయమైన సాయంత్రం 5.30 గంటలకు 50 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఇసి) ప్రకటించింది. అవాంఛనీయ ఘటనలేవీ చోటుచేసుకోలేదని పేర్కొంది. 250 వార్డుల్లో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7న చేపట్టనున్నారు.
ఎన్నికలను బహిష్కరించిన శివారు గ్రామ ప్రజలు
నార్త్ వెస్ట్ జిల్లాలోని కటేవర గ్రామంలో ప్రజలు ఎంసిడి ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి సరైన రోడ్లు లేవని, ఉన్న రోడ్లు గుంతల మయమైనా పట్టించుకోవడం లేదని, మురుగునీటి వ్యవస్థ కూడా సరిగా లేదని, అందువల్లే తాము ఎన్నికలను బహిష్కరించాల్సివచ్చిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యేదాకా తాము ఏ ఎన్నికల్లోనూ పాల్గొనే ప్రసక్తే లేదని వారు తెలిపారు.