Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయనగరం: ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడని పలువురు వక్తలు కొనియాడారు. పద్మశ్రీ ఘంటసాల శత జయంతి ఉత్సవం ఆదివారం విజయనగరంలో ఘనంగా జరిగింది. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యాన గుమ్చీ సెంటర్లోని ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సంగీతాన్ని అభ్యసించిన ప్రభుత్వ సంగీత కళాశాల వరకూ గుర్రపు బగ్గీపై ఘంటసాల చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడి ఘంటసాల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఘంటసాల చిత్రపటంతో నగర పురవీధుల్లో ఘంటసాల అభిమానులు ఆయన పాటలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. గుర్రపు బగ్గీపైకళాపీఠం ప్రధాన కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు... తంబుర పట్టుకుని ఘంటసాల వేషధారణతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఘంటసాల స్మారక కళా పీఠం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గ్రంధి విష్ణుమూర్తి, సర్వేశ్వర రావు మాట్లాడుతూ విజయనగరం ఖ్యాతిని ప్రపంచ దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు ఘంటసాల సంగీత సామ్రాజ్యంలో ప్రముఖుడని అన్నారు. ఆయన సంగీత సాధన సమయంలో ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నాడో అటువంటి కష్టాలతో ఆయన దగ్గరకు వచ్చిన వారిని చేరదీసి ఆదరించారని కొనియాడారు. ఘంటసాల పాడలేని పాటలు లేవని, యుగళ గీతాలైనా, భక్తి గీతాలైనా ఆయనకు ఆయనే సాటని అన్నారు. ఆనంద గజపతి ఆడిటోరియంలో సంగీత దర్శకులు ఎం.భీష్మారావు సారధ్యంలో 12 గంటల పాటు నిర్విరామంగా ఘంటసాల శత వసంతాల పాటల పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ సంగీత దర్శకులు వసూరావుకు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యాన స్వర్ణ కంకణాన్ని బహూకరించారు.