Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 93 స్థానాల్లో 833 మంది పోటీ
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. చివరిదైన రెండో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాలు..అహ్మదాబాద్, గాంధీనగర్, మేహ్సన, పటాన్, బనస్కాంత, శబర్కాంత, అరావళి, మహిసాగర్, పంచమహల్, దాహౌద్, వడోదర, ఆనంద్, ఖేద, ఛోహౌత, ఉదయిపుర్ లోని 93 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ పోలింగ్‌లో 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 26,409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 36,000 ఇవిఎంలను వినియోగించనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు దాదాపు 29 వేల మంది ప్రిసైడింగ్ అధికారులను, సుమారు 84 వేల మంది పోలింగ్ అధికారులను ఇసి నియమించింది. రెండో విడతలో కీలక నియోజవర్గాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పోటీ చేస్తున్న ఘట్లోడియా, పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరంగం, మరో బిజెపి కీలక నేత అల్పేష్ ఠాకుర్ బరిలో నిలిచిన గాంధీ నగర్ సౌత్ ఉన్నాయి. అలాగే గుజరాత్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుఖరాం రథవ పోటీ చేస్తున్న ఛోహతా ఉదయిపుర్ కూడా కీలక నియోజకర్గం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రముఖుల్లో లఖాభాయి భర్వాద్ (వీరంగం), జిగేశ్ మేవానీ (వడగామ్), అమీ యజ్ఞిక్ (ఘట్లోడియా) కూడా రెండో విడతలోనే బరిలో ఉన్నారు. ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి విడత పోలింగ్‌లో 63.31 శాతం ఓటింగ్ నమోదైన సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 8న చేపట్టనున్నారు.
యుపిలో 'ఉప' సమరం
ఉత్తరప్రదేశ్‌లో మినీ సమరం కూడా సోమవారమే జరగనుంది. ఒక లోక్‌సభ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగున్న ఈ ఎన్నికల్లో అధికార బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ - రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్, బిఎస్పి పోటీ చేయడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 24.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ మరణించడంతో మైన్‌పురి పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిరాగా..వేర్వేరు కేసుల్లో ఎస్పి ఎమ్మెల్యే అజంఖాన్, బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ దోషులుగా తేలడంతో రాంపుర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, కథౌలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎన్నికలు అనివార్యమయ్యాయి. అజంఖాన్ విద్వేష ప్రసంగాలు చేసిన కేసులో శిక్షను ఎదుర్కొకాగా, బిజెపి నేత సైనీ 2013 ముజఫర్‌నగర్ మత ఘర్షణల్లో దోషిగా తేలి శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ఉప సమరంలో జయాపజయాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలను మానసికంగా సంసిద్ధలును చేసేందుకు దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మైన్‌పురిలో ఆరుగురు, కథౌలిలో 14 మంది, రాంపుర్ సదర్‌లో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మైన్‌పురిలో ములాయం సింగ్ యాదవ్ పెద్ద కోడలు, ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తుండగా, బిజెపి తరపున రఘురాజ్ సింగ్ శాక్యా బరిలో ఉన్నారు. ఇక రాంపుర్ సదర్‌లో బిజెపి నుంచి అకాష్ సక్సేనా, సమాజ్‌వాదీ పార్టీ తరుపున అజంఖాన్ అనుచరుడు అసిం రాజా పోటీ చేస్తున్నారు. కథౌలీలో విక్రమ సింగ్ సైనీ భార్య రాజ్‌కుమారీ సైనీకి, ఆర్ఎల్డి నేత మదన్ భయ్యా మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8ననే వెలువడనున్నాయి.