Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల పాటు 'హాత్ సే హాత్ జోడో అభియాన్'
- జనవరి 26న అన్ని రాష్ట్రాల్లో 'మహిళ మార్చ్'లు
- స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ : ఫిబ్రవరి రెండో భాగంలో ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నది. అలాగే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు 'హాత్ సే హాత్ జోడో అభియాన్' నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం ఆదివారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేలా, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పి.చిదంబరం, అంబికా సోని, మీరా కుమారి, ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రపై సమీక్షించారు. ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో ముగించుకొని, రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య చర్చకు వచ్చింది. పార్టీ ప్లీనరీ సమావేశం తదితర అంశాలపై చర్చ చేపట్టారు. సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ పై నుంచి కింద వరకు సంస్థాగత జవాబుదారీతనం గురించి గట్టిగా నిలదీశారు. తమ బాధ్యతలను నెరవేర్చలేని వారు తమ సహచరులకు వదిలేయాలని సూచించారు. రానున్న 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని అన్ని రాష్ట్రాల ఇన్చార్జీలను కోరారు. భారత్ జోడో యాత్ర చరిత్రను లిఖిస్తుందని, యాత్ర ఇప్పుడు జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు. విద్వేష బీజాల విత్తులు నాటే, విభజన సృష్టిస్తూ, ఆ ఫలాలను పొందే పాలక శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యమని ఖర్గే అన్నారు.
జనవరి 26 నుంచి రెండు నెలల పాటు 'హత్ సే హత్ జోడో అభియాన్' నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పంచాయతీలు, బూత్‌లను కవర్ చేస్తూ బ్లాక్ స్థాయిలో పాదయాత్రలు, జిల్లా స్థాయిలో సమావేశాలు, రాష్ట్ర రాజధానులలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు కెసి వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రజలకు సందేశం ఇస్తూ రాసిన లేఖతో పాటు మోడీ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. యువతను అనుసంధానం చేస్తూ గ్రామ సభలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ అన్ని రాష్ట్రాల్లో 'మహిళ మార్చ్‌లు' నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ 85 ప్లీనరీ సమావేశాన్ని ఫిబ్రవరి ద్వితీయార్థంలో రారుపూర్‌లో జరుగుతోందని తెలిపారు. రాజకీయ పరిస్థితులు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యవసాయం వంటి పలు అంశాలపై ప్లీనరీలో చర్చిస్తామని అన్నారు.
జైరాం రమేష్ మాట్లాడుతూ భారత జోడో యాత్ర వివరాలను వెల్లడించారు. యువతకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. 'భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశించనున్నది. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో 2,500 కిలో మీటర్ల పొడువునా యాత్ర సాగింది. ఇంకా 1,100 కిలో మీటర్ల యాత్ర మిగిలి ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యాత్ర 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజానీకంతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది' అని తెలిపారు. 'జోడోయాత్ర తరువాత ఏం చేయాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించాం. తరువాత కొనసాగింపు ఎలా ఉండాలి? హత్ సే హాత్ జోడో అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించాం. ఇది బ్లాక్, జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంశాలను ప్రచారం చేస్తాం' అని అన్నారు.