Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో అన్ని పార్టీలూ పాల్గొనాలి : అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జీ-20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు అందరం సహకారంతో పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భారతదేశం జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం, దేశంలో దాదాపు 50 నగరాల్లో 200పైగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సోమవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ పార్టీల నేతలు సూచనలు చేశారు. సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ జీ-20 అధ్యక్షుడి బాధ్యతలను ఏడాది పాటు నిర్వహించడంపై ప్రణాళిక చేసిన కార్యక్రమాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ జీ-20 ప్రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ఇది దేశానికి లభించిన గౌరవం. ఒక పార్టీ లేదా వ్యక్తి కాదు. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణం. భారతదేశానికి గర్వకారణం. అందుచేత మనమందరం సహకారంతో పని చేయాలి'' అని ప్రధాని మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసీపీ), ఎంకె స్టాలిన్ (డీఎంకే) అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మమతా బెనర్జీ (టీఎంసీ), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ప్రేమ్‌సింగ్ తమాంగ్ (ఎస్కేఎం), ఏక్నాథ్ షిండే (శివసేన-షిండే), జోరంతంగా (ఎంఎన్ఎఫ్), ఎన్. చంద్రబాబునాయుడు (టీడీపీ), పలనిస్వామి (అన్నాడీఎంకే), కె.ఎం. కాదర్ మొహిదీన్ (ఐయూఎంఎల్), పసుపతి కుమార్ పారస్ (ఆర్ఎల్జేపీ), రాందాస్ అథ్వాలే (ఆర్పీఐ), హనుమాన్ బెనివాల్ (ఆర్ఎల్పీ), కెఎం మణి (కేసీ), తిరుమవలన్ (వీసీకే), కేంద్ర ప్రభుత్వం తరపున హౌం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
తమకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతాం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జి-20 శిఖరాగ్ర సమావేశానికి తమకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ వేదిక కావడం పట్ల సిఎం వైఎస్.జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
భారత ప్రయోజనాల కోసం ఉపయోగించాలి : ఖర్గే
భారత ప్రయోజనాల కోసం జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యతాన్ని పొందటం కోసం ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలని టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.
పూర్తి మద్దతు, సహకారం : ఎంకె స్టాలిన్
డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ దేశం దశాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన, స్థిరమైన విదేశాంగ విధానాన్ని కలిగి ఉందనీ, అది అహింస విధానమని పేర్కొన్నారు. జీ20 ప్రెసిడెన్సీ ప్రపంచ దక్షిణాదికి వాయిస్‌గా నిలబడటం తమ వంతు అని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి దాదాపు పది పార్టీల వరకు గైర్హాజరు అయ్యాయి. టీఆర్ఎస్, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఠాక్రే), ఆర్ఎస్పీ, ఎంఐఎం, అప్నాదల్, ఎస్ఏడీ, ఏఐయూడీఎఫ్, జేఎంఎం తదితర పార్టీలు హాజరు కాలేదని సమాచారం.