Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే లక్ష్యం సాక్షాత్కారం
- సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆందోళనకర పోకడలను సరిదిద్దాలి
- దేశంలో ద్వేషం, హింస పెరిగింది
- అసమ్మతిని జారతీ వ్యతిరేకంగా ముద్ర వేస్తున్నారు
- దీంతో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు విఘాతం : అఖిలపక్ష సమావేశంలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం లక్షణాన్ని నిర్వచించే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ పునాదులను రక్షించుకోవటంతోనే ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం సాక్షాత్కారమవుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ప్రస్తుత ఆందోళనకరమైన పోకడలను సరిదిద్దాలని నొక్కి చెప్పారు. భారతదేశం స్వీకరించిన జీ-20 అధ్యక్షత బాధ్యతలను, ప్రకటించిన లక్ష్యాలను ప్రపంచం గుర్తించాలంటే ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సూచించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. జీ-20 అధ్యక్ష బాధ్యత ప్రతి దేశానికి రొటేషన్ పద్దతిలో వస్తుందని తెలిపారు. దక్షిణాసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో జీ-20 ఏర్పాడిందనీ, నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల వల్ల నెలకొన్న సంక్షోభ భారాన్ని పంచుకోవడానికి సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోకి ప్రవేశించనప్పుడు జీ-7, జీ-20గా విస్తరించిందని గుర్తుచేశారు. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తరువాత ప్రారంభ మంత్రుల స్థాయి సంప్రదింపులు ప్రభుత్వ సమ్మిట్ల అధిపతులుగా మార్చబడ్డాయనీ, అప్పటినుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ, సామాజిక, రాజకీయ పరిస్థితులతో పెద్దగా సంబంధంలేని రొటేషన్ అధ్యక్ష పద్ధతిని అవలంబిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్ చుట్టూ దేశీయ రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారనీ, భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ ఏకత్వం సార్వత్రిక భావాన్ని ప్రోత్సహించడానికి పని చేస్తుందని అన్నారని ఏచూరి తెలిపారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకోవడానికి లక్ష్య సాధన దిశగా పని చేయాలని సూచించారు. వసుధైవ కుటుంబం అనే భావన అంటే ఏకరూపతను విధించడం కాదనీ, అన్ని వైవిధ్యాలను సమానత్వం, గౌరవం ఆధారంగా పరిగణించడంతో సామాజిక బహుళత్వాలు జరుపుకునే ప్రపంచ కుటుంబానికి గుర్తింపు అని తెలిపారు. అటువంటి ప్రపంచ కుటుంబం ప్రతి దేశంలో దేశీయంగా స్థాపించబడిన అటువంటి సమాజాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. 'ప్రధాని మోడీ ప్రకటించిన లక్ష్యం కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రకటించినట్టుగా అందరికీ సమానత్వంపై ఆధారపడిన సమాజం, రాజకీయ నిర్మాణాన్ని సృష్టించటంపై ఉండాలి. ఇది పౌరులందరికీ న్యాయం, సామాజిక, రాజకీయ, ఆర్థిక పంపిణీపై ఆధారపడి ఉంటుంది' అని తెలిపారు. 'ద్వేషం, బీభత్సం, హింస వంటి దుర్మార్గపు ప్రచారాల ఆధారంగా మతపరమైన ధ్రువీకరణ ప్రస్తుత ప్రమాదకర స్థాయిలు ప్రధాని మోడీ ప్రకటించిన వాటి పునాదులను నాశనం చేస్తున్నాయి. భయంకరంగా పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికంతో ఆర్థిక మందగమనం అధమస్థాయికి పడిపోతోంది. మహిళలు, దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలపై సామాజిక అన్యాయాలు పెరిగిపోతున్నాయి. అసమ్మతి వ్యక్తీకరణలన్నింటినీ 'జాతీయ వ్యతిరేకం'గా పరిగణించడంతో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలకు సంబంధించిన రాజ్యాంగ హామీలు తీవ్రంగా పరిమితం చేయబడ్డాయి' అని తెలిపారు.