Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక, న్యాయ శాఖ అధికారులు అభ్యంతరం
- అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది
- సుప్రీం కోర్టులో ఏడీఆర్ అఫిడవిట్
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పథకంలో సవరణలు చేస్తూ బాండ్ల విక్రయానికి 15 రోజుల అదనపు గడువును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ను కేంద్ర ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన కొంత మంది అధికారులు అభ్యంతరాలను లేవనెత్తారని, కానీ వాటిని పక్కన పెట్టి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ (ఏడీఆర్) పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్లో పేర్కొంది. 2022 నవంబర్ 7న ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్లను విక్రయించడానికి 15 రోజుల అదనపు వ్యవధిని అనుమతించడానికి ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి అపారదర్శక పద్ధతిలో మరిన్ని ఎక్కువ విరాళాలు అందజేయడానికి ఈ సవరణ జరిగిందని ఎడిఆర్ వాదిస్తోంది. ఆర్టిఐ చట్టం కింద కమోడోర్ లోకేష్ బాత్రా పొందిన పత్రాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సబార్డినేట్ అధికారులు, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు ఈ సవరణకు వ్యతిరేకంగా హెచ్చరించారని ఏడీఆర్ పేర్కొంది. ఈ విషయం అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున లీగల్ అభిప్రాయాన్ని పొందాలని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు సూచించినట్లు కూడా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ లోక్సభ ఎన్నికల జరిగే సంవత్సరంలో అనుమతించిన 30 రోజుల అదనపు విండో మాదిరిగానే 15 రోజుల అదనపు విండోను అనుమతించానికి, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి నిషేధం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నుండి అనుమతి పొందడంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి స్పందిస్తూ 2021 మార్చిలో ఇదే విధమైన సవరణను ప్రతిపాదించారని, దీనిని ఈసీఐ గుర్తించిందని, అందువల్ల ఈసీఐకి ఈ విషయంపై మరొక సూచన అవసరం లేదని అన్నారని ఏడీఆర్ పేర్కొంది. కింది స్థాయి అధికారుల సూచనలను సీనియర్ అధికారులు ఆర్థిక మంత్రితో చర్చించారని, అయితే ప్రతిపాదనలు తోసిపుచ్చారని ఎత్తి చూపింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం-2018కి సవరణ తీసుకురావడానికి ముందు ఎన్నికల సంఘం ముందుస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావించడమంటే, అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా భావించడంతో పాటు సవరణ వెనుక ఉద్దేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏడీఆర్ పేర్కొంది. ప్రజాస్వామ్య ఆలోచన పట్ల ప్రభుత్వం విముఖతంగా ఉందని స్పష్టమవుతోందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ సవరణకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ నుంచి ఉద్దేశపూర్వకంగా దాచడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నించినట్లు ఇది స్పష్టం చేస్తోందని ఏడీఆర్ పేర్కొంది. ఈ సందర్భంగా 2009లో కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీకి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక సంఘం అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను అఫిడవిట్లో పేర్కొంది. ఆ లేఖలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏదైనా విధాన ప్రకటనలు, ఆర్థిక చర్యలు, పన్ను సంబంధిత సమస్యలు, ఇతర ఆర్థిక ఉపశమనాలపై ముందస్తు ఆమోదం తీసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొందని ఏడీఆర్ గుర్తు చేసింది.
ఏదైనా ప్రయోజనాలను ప్రకటించే ముందు మంత్రిత్వ శాఖలు ఎన్నికల కమిషన్ ఆమోదం తీసుకోవాలని పేర్కొనట్టు తెలిపింది. మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ (ఎంసీసీ) భావనను ఉన్నత న్యాయస్థానం గుర్తించడమే కాకుండా ఆమోదించిందని ఏడీఆర్ పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల పథకానికి మార్గం సుగమం చేసిన ఆర్థిక చట్టం-2017 సవరణలను సవాల్ చేస్తూ 2017లో ఎడిఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు 22 విడతల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం జరిగితే, అందలో రూ.10,791. 47 కోట్ల విలువైన 19,520 ఎలక్టోరల్ బాండ్లు అమ్మకం జరిగాయని ఆర్టిఐ కార్యకర్త కమోడోర్ లోకేస్ కె.బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు 2022 ఆగస్టు 28న సమాధానం వచ్చింది.