Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు సంబంధించిన డీపీఆర్ కి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) వద్ద ఉందని, దానిని ఆమోదించాలని జీఆర్ఎంబీకి సూచించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు భూ సేకరణ చేస్తున్నారంటూ శ్రీరాం గంగాజమున, చెరకు శ్రీనివాసరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ కేఎఎం జోసెఫ్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ వాదనలు వినిపించారు. అనుమతుల్లేకుండా మూడో టీఎంసీలు పనులు చేపట్టవద్దని జలశక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, విస్తరణ పనులపై నివేదికలు సమర్పించాలని శాఖ కోరిందని తెలిపారు. అనుమతులు లేకుండా పనులు సాగించరాదని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని, ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల ప్రాజెక్టుతోనే పంపుహౌస్ లు మునక వంటి సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. మరో టీఎంసీి పనులకు అనుమతిస్తే జరగబోయే నష్టాలపై అధ్యయనం చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ''కేంద్ర అనుమతుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) సమర్పించామని, దానిని సిడబ్ల్యుసి ఆమోదించిందని, ప్రస్తుతం జిఆర్ఎంబి వద్ద ఉందని, దానిని బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. డిపిఆర్ ను ఆమోదించేలా జిఆర్ఎంబికి సూచనలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపిస్తూ ఈ పనులపై సుప్రీంకోర్టు గతంలో స్టేటస్ కో విధించిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జలశక్తి నుంచి స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.