Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్‌ను పరమాత్మగా ప్రకటించాలన్న పిటిషన్ తిరస్కరణ
- పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా
న్యూఢిల్లీ : భారతదేశం లౌకిక దేశమని సర్వోన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. సత్సంగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను 'పరమాత్మ'గా ప్రకటించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిటిషన్)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉపేంద్రనాథ్ దలై అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. భారతదేశం లౌకిక దేశమనీ, శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మ (సుప్రీమ్ స్పిరిట్)గా దేశ పౌరులు ప్రార్థన చేయడానికి పిటిషనర్‌ను అనుమతించలేమని ధర్మాసనం పేర్కొంది. అలాగే పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోసం పిటిషన్ దాఖలు చేసినందుకు పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ''మీకు కావాలంటే మీరు అయన్ని పరమాత్మగా పరిగణించవచ్చు. ఇతరులపై ఎందుకు రుద్దుతారు?'' అని ధర్మాసనం ప్రశ్నించింది. హిందీలో వాదిస్తున్న పిటిషనర్‌ను ఉద్దేశించి 'మీ ఉపన్యాసం వినడానికి మేం ఇక్కడ లేం. మనది సెక్కులర్ దేశం. ఈ పిల్కి ఏమైనా అర్థం ఉందా?'' అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. 'మీ గురూజీని అందరూ అంగీకరించాలని మీరు అంటున్నారు. వారి వారి దేవున్ని ఎంచుకోటానికి దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది'' అని జస్టిస్ షా అన్నారు. ఈ పిటిషన్ వాస్తవమైన పిల్ కాదనీ, దీన్ని కొట్టివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంటూ పిటిషనర్‌కు ఫైన్ విధించింది. ఇలాంటి పిల్లు దాఖలు చేసే ముందు కనీసం నాలుగు సార్లు ఆలోచించాలని జస్టిస్ షా సూచించారు. రూ.లక్ష జరిమానాను నాలుగు వారాల్లో సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.