Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 93 స్థానాలు.. 58 శాతం ఓటింగ్
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పరిసమాప్తం
- ఈవీఎంలలో 833 మంది అభ్యర్థుల భవితవ్యం
- అంతగా ఆసక్తి చూపని గుజరాత్ ఓటర్లు
అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో దశ కొన్ని అవాంఛనీయ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగి సింది. ఈ దశలో మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 58 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ సహా మొత్తం 61 మంది పార్టీల నుంచి మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న వెల్లడి కానున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సుఖ్రమ్ రత్వా లు ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. ఎన్నికల్లో గుజరాత్ ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదన్న విషయం స్పష్టమైంది. ఉదయం 11 గంటల వరకు 19 శాతమే పోలింగ్ నమోదు కావటం దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అన్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో ఇప్పటికే మొదటి దశ ముగిసిన విషయం విదితమే. 89 స్థానాలకు డిసెంబర్ 1న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండో దశలో బీజేపీ, ఆప్‌లు మొత్తం 93 స్థానాలకూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్ 90 స్థానాల్లో, తన భాగస్వామి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండు స్థానాల్లో పోటీ చేశాయి. భారతీయ ట్రైబల్ పార్టీ (12 స్థానాలు), బీఎస్పీ (44 స్థానాలు) లూ ఎన్నికల బరిలో ఉన్నాయి. రెండో దశలోని 93 స్థానాలు 14 జిల్లాల్లోనివి. ఇందులో ప్రధాన నగరాలు, జిల్లాలైన అహ్మదాబాద్, వడోదరా, గాంధీనగర్‌లు ఉన్నాయి. మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లున్నారు. అహ్మదాబాద్‌లోని రానిప్‌లో గల నిషాన్ పబ్లిక్ స్కూళ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌ను మోడీ అభినందించారు. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి అహ్మదాబాద్‌లోని ఒక పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళ్తూ ప్రధాని మోడీ రెండున్నర గంటలు రోడ్ షో నిర్వహించటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తెలిపారు. తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెహ్సానా జిల్లాలోని నాలుగు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి.