Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాని విలువ రూ.405 కోట్లు .. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలో ఏడాదిలో రూ.405.35 కోట్ల విలువైన 833.07 కిలోల స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తెలిపింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ''స్మగ్లింగ్ ఇన్ ఇండియా'' 2021-22 రిపోర్టును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కస్టమ్స్ విభాగం రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రూ. 20,064 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.1,323 కోట్ల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో వెల్లడించింది. 28,334.32 కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గంజాయి 51 శాతం, హెరాయిన్ 29 శాతం, కోకైన్ 8 శాతం పట్టుబడ్డాయి. 131 మంది అరెస్టు చేశారు. 13 కేసుల్లో 11.36 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. రూ.9.33 కోట్ల విలువైన 1,102.63 లక్షల సిగరెట్లు స్మగ్లింగ్ అయినట్టు తెలిపింది. 14 కేసుల్లో రూ.97.05 కోట్లు విలువైన 161.83 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం పట్టుకున్నట్లు తెలిపింది. గంజాయిలో మధ్యప్రదేశ్ (5,846 కేజీలు), త్రిపుర (4,264 కేజీలు), ఉత్తరప్రదేశ్ (3,141 కేజీలు)మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానం (1,057 కేజీలు)లో ఉంది.
ఏపీలో స్మగ్లింగ్
ఏపీలోని శేషాచలం, పాలకొండ అడవుల్లో కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతోందని, అనంతపురం, కర్నూల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ పెరుగుతోందని తెలిపింది. ఏపీలో ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు ఆయుధాలు స్వాధీనం చేసుకోగా, ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపింది. సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల్లో ఏపీలోనే ఎక్కువ ఉందని తెలిపింది. ఏపీలో 18,267.84 కేజీలు పట్టుబడగా, 90 మంది అరెస్టు చేసినట్టు తెలిపింది. తెలంగాణలో 1,012.04 కేజీలు పట్టుబడగా, ఐదుగురు అరెస్టు అయ్యారు. ఏపీలో రూ.97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.