Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీకి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వం: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడి
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కమిటీ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వం వహించే ఈ కమిటీలో ఆయనతో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ''సుప్రీం కోర్టు కమిటీ ఆన్ యాక్సెసిబిలిటీ'' అని పిలిచే కమిటీ సుప్రీం కోర్టు ప్రాంగణంలో సమగ్ర యాక్సెసిబిలిటీ ఆడిట్ నిర్వహించే బాధ్యతను నిర్వహిస్తోంది. ఆడిట్ సాంకేతిక, భౌతిక యాక్సెసిబిలిటీ విస్తరిస్తుంది. సుప్రీం కోర్టు ప్రాంగణాన్ని సందర్శించే వికలాంగులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల స్వభావం, పరిధిని అంచనా వేయడానికి వికలాంగుల కోసం ప్రశ్నావళిని సిద్ధం చేసి విడుదల చేసే బాధ్యత కూడా కమిటీకి అప్పగించారు. కమిటీలో బెంగళూర్ ఎన్ఎల్ఎస్ఐయు ప్రొఫెసర్, సుప్రీం కోర్టులో పని చేసే వికలాంగు ఉద్యోగి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ నామినేట్ చేయబడిన వికలాంగు న్యాయవాది, నల్సార్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిసెబిలిటీ స్టడీస్ నామినేట్ చేసే వ్యక్తి సభ్యులుగా ఉంటారు. కమిటీకి సభ్య కార్యదర్శిగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీ అధికారి ఉంటారు. కమిటీ సుప్రీం కోర్టు న్యాయవాదులు, ఇతరులు నుండి కూడా సమస్యలను సేకరిస్తుందని, ఈ సమస్యలను తొలగించే దిశగా ప్రతిపాదనలను సిఫారసు చేస్తుందని సుప్రీం కోర్టు ప్రకటనలో తెలిపింది.