Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాఖ్య వ్యవస్థ పరిరక్షించాలి
- సీపీఐ దేశవ్యాప్త ఆందోళన : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూఢిల్లీ : గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని, సమాఖ్య వ్యవస్థ పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సోమవారం నాడిక్కడ సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి.రాజా వెల్లడించారు. అక్టోబర్లో విజయవాడలో విజయవంతంగా జరిగిన 24వ పార్టీ అఖిల భారత మహాసభను కార్యవర్గం సమీక్షించిందని అన్నారు. కొత్తగా ఎన్నికైన జాతీయ కార్యవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించామని తెలిపారు. ఫెడరలిజం పరిరక్షణ, గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని ప్రచారానికి సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకతాటిపైకి రావాలని కార్యవర్గం పిలుపు నిచ్చిందని తెలిపారు. రాజ్యాంగ పునాదులను దెబ్బతీసేందుకు ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడపై దేశాన్ని అప్రమత్తం చేసేందుకు సీపీఐ కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ కేంద్రీకరణ భావజాలంతో మార్గనిర్దేశం చేస్తూ గవర్నర్ కార్యాలయాన్నిదుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రాజ్భవన్లు బీజేపీ క్యాంపు కార్యాలయాలుగా పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ అభిప్రాయపడిందన్నారు. ఈ అంశంపై డిసెంబర్ 29ని 'డిఫెండ్ ఫెడరలిజం డే'గా పాటించాలని దేశవ్యాప్తంగా సిపిఐ అన్ని యూనిట్లకు జాతీయ కార్యవర్గం పిలుపు ఇచ్చిందని తెలిపారు. మీడియా సమావేశంలో సీపీఐ రాజ్యసభ ఎంపీ బినరు విశ్వం, జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు.