Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై చర్చించాలి
- అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్
- నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- 19 కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు జాబితా
న్యూఢిల్లీ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న సరిహద్దు సవాళ్లపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల ఆధిపత్యంపై కూడా చర్చించాలని డిమాండ్ చేశాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైనా అన్ని పార్టీలూ లేవనెత్తాయి. నేటి (బుధవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు 23 రోజుల పాటు 17 రోజుల సభా కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా చేసింది. బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాలను ప్రభుత్వం కోరింది. మంగళవారం నాడిక్కడ పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశాల ప్రభుత్వ ఎజెండాను వివరించారు. దాదాపు 30కి పైగా పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్, మురళీధరన్, అధిర్ రంజన్ చౌదరి, నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), సుధీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), మార్గని భరత్ (వైసీపీ), కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్ (టీడీపీ), కె.కేశవరావు (టీఆర్ఎస్), సంజరు సింగ్ (ఆప్), సస్మిత్ పాత్ర (బీజేడీ), వందన చౌహాన్ (ఎన్సీపీ), పిఆర్ నటరాజన్, బికాష్ రంజన్ భట్టాచార్య (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), తంబిదొరై (అన్నాడీఎంకే), హర్సిమ్రత్ కౌర్ (ఎస్ఏడీ), జోషి కె మణి (కేసీఎం), అబ్దుల్ వహాబ్ (ఐయూఎంఎల్), జికె వాసన్ (టీఎంసీ(ఎం)) తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగంపై చర్చించాల్ణి కాంగ్రెస్
ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా, నిరుద్యోగం, ధరలు పెరుగుదల, చైనా-ఇండియా సరిహద్దులో పరిస్థితి వంటి సమస్యలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం విలేకరులతో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలు దేశం ముందు ఉన్నాయనీ, ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఏమీ తెలియజేయలేదని చౌదరి ఆరోపించారు. సభలో తాము జాతీయ భద్రత, కాశ్మీరీ పండిట్ల హత్యలపై చర్చకు డిమాండ్ చేస్తామన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాపై చర్చలు జరపాలని కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఎయిమ్స్‌పై సైబర్ దాడి, రైతులకు ఎంఎస్పీ, ఉద్యోగాల భర్తీ, ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టాల నిర్వీర్యం, న్యాయ వ్యవస్థపై కేంద్రం దాడి, స్వతంత్ర సంస్థల ధ్వంసం, రూపాయి పతనం, దేశంలో ప్రమాద స్థాయిలో కాలుష్యం, మహిళలపై దాడులు తదితర అంశాలను లేవనెత్తుతామని తెలిపారు.
రాష్ట్రాలపై అణచివేత ప్రయత్నాలపై లేవనెత్తుతాం : టీఎంసీ
ఆర్థిక మందగమనం, ధరలు పెరుగుదల, రాష్ట్రాలపై అణచివేత ప్రయత్నాలు వంటి అంశాలపై చర్చించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం, రాష్ట్రాల ఆర్థిక దిగ్బంధంపై చర్చలు జరపాలని కోరినట్టు చెప్పారు. ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని ప్రభుత్వానికి తెలియజేసినట్టు ఓబ్రెయిన్ అన్నారు.
సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం
సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల సహకారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాల సహకారాన్ని ప్రహ్లాద్ జోషి కోరారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అన్ని అంశాలను తాము గమనించామని, పార్లమెంటు నిబంధనలు, విధానాల ప్రకారం చర్చలు జరుగుతాయని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో చర్చకు సంబంధించిన అంశాలను ఖరారు చేస్తామని చెప్పారు.
19 కొత్త బిల్లులు జాబితా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొత్తం 25 బిల్లులను ఆమోదం కోసం జాబితా చేసింది. అందులో 19 కొత్త బిల్లులు ఉన్నాయి. నాలుగు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందాయి. రెండు ఆర్థిక బిల్లులు ఉన్నాయి. అటవీ సంరక్షణ సవరణ బిల్లు-2022, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, ఓల్డ్ గ్రాంట్ రెగ్యులేషన్ బిల్లు, కంటోన్మెంట్ బిల్లు, నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లులతో సహా వివిధ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలు ప్రారంభమైన ఒక రోజు తరువాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో రాజకీయ పార్టీల నేతల్లో హడావుడి పెరగనుంది. ప్రస్తుత పార్లమెంట్ హౌస్‌లో శీతాకాల సమావేశాలు కూడా చివరిది. తదుపరి సమావేశమైన బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరిగే అవకాశం ఉంది.
గవర్నర్ల ఆధిపత్యంపై చర్చించాలి : సీపీఐ(ఎం)
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల పై గవర్నర్ల ఆధిపత్యం చెలాయిస్తున్నారనీ, దీనిపై చర్చించాలని సీపీఐ(ఎం) నేతలు పిఆర్ నటరాజన్, బికాష్ రంజన్ భట్టాచార్య డిమాండ్ చేశారు. సమావేశ అనంతరం నటరాజన్, భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ ధరలు పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, ఆర్థిక మందగమనం వంటి ప్రజా సమస్యలతో గవర్నర్ల అంశాన్ని లేవనెత్తామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశామన్నారు. అలాగే న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిని లేవనెత్తామని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీజేడీ డిమాండ్ చేయగా, జనాభా నియంత్రణ బిల్లును ఆమోదించాలని శివసేన షిండే వర్గం కోరింది. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)పై చర్చ జరగాలనీ, రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉండేలా చట్టం తేవాలని ఆప్ నేత సంజరు సింగ్ డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్లపై చర్చ జరపాలి : టీఆర్ఎస్
మహిళ రిజర్వేషన్లపై చర్చించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై చర్చ జరగాలనీ, 17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై పార్లమెంట్లో అందరిని కలుపుకొని ఆందోళన చేస్తామన్నారు.
విద్యుత్ కంపెనీలు పదిశాతం బొగ్గును తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై చర్చ జరగాలని, దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.