Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస ఆదాయ భద్రత లేకుండా సంక్షోభం పోదు : ఆర్థిక నిపుణులు
- డిసెంబర్ తర్వాత ఆగిపోనున్న ఉచిత బియ్యం !
- నగదు బదిలీతో 60శాతం జనాభాకు లబ్ది చేకూరుతుంది..
- యువతలో 19శాతం నిరుద్యోగులే..
- పీఎం కిసాన్తో భూస్వాములకే లబ్ది జరుగుతోంది..
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం తర్వాత పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో వృద్ధి సాధించిందని ప్రధాని మోడీ సహా, బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కోట్లాది కుటుంబాలకు ఉపాధి పోయింది. దీనినే 'ఉపాధి రహిత వృద్ధి'గా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్లే మన ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘకాలంగా వేతనాల్లో కోత, ఉద్యోగాల్లో కోత కొనసాగుతోంది. మరోవైపు అధిక ధరలు సామాన్యుడ్ని తినేస్తున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా కేవలం 5 కిలోల ఉచిత బియ్యం విదిలించి మోడీ సర్కార్ చేతులు దులుపుకుంది. అధికారంలోకి రాకముందు నగదు బదిలీ అంటూ ఊదరగొట్టిన బీజేపీ నాయకులు..ఇప్పుడు సంక్షోభ సమయాన ఆ మాట ఎత్తటం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పెరిగిందంటూ ప్రజల సమస్యలను తప్పుదారి పట్టిస్తున్నారు. భారతీయ సమాజాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయని, సగటు కుటుంబం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే కనీస ఆదాయ భద్రత, నగదు బదిలీ చేపట్టడం ఒక్కటే పరిష్కారమని పాలకులకు సూచిస్తున్నారు.
రూ.57వేల కోట్లు ఇవ్వలేరా?
పీఎం కిసాన్ కింద మోడీ సర్కార్ చేపట్టిన నగదు బదిలీ కొద్ది మంది ధనిక రైతులకే లబ్ది చేకూరుతోందన్న విమర్శలున్నాయి. రూ.6వేలను మూడు విడుతలగా లబ్దిదారులకు కేంద్రం అందజేస్తోంది. పీఎం కిసాన్ అందుకోని పేద రైతులు, రైతు కూలీలు ఎంతోమంది ఉన్నారు. వీరిని లెక్కలోకి తీసుకొని నగదు బదిలీ చేపట్టాల్సి ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పీఎం-కిసాన్‌ను అమలుజేస్తే..దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి లబ్దిచేకూరుతుందని నిపుణులు తెలిపారు. నగదు బదిలీకి అర్హులైన కుటుంబాలు 10.9కోట్లు ఉంటాయని ఆర్థిక నిపుణులు ఒక నమూనాను కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. సుమారుగా రూ.57వేల కోట్లతో వీరందరికీ అత్యంత తక్కువ మొత్తంతో నగదు బదిలీ చేపట్టవచ్చునని చెబుతున్నారు. దేశంలోని 60.69శాతం జనాభా ఈ పథకంతో లబ్దిపొందుతుందని ఆర్థిక నిపుణులు గణాంకాలతో సహా కొన్ని నమూనాలను సిద్ధం చేశారు.
అప్పుల్లో కూరుకుపోయారు..
కరోనా సంక్షోభం దెబ్బ నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. అప్పులు చేసి, ఇంట్లో ఉన్నది అమ్మేసి..పిల్లల చదువులు మాన్పించి..ఆయా కుటుంబాలు కాలానికి ఎదురీ దుతున్నాయి. సంక్షోభం నాటి పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య మార్కెట్లు కాస్త తేరుకు న్నాయి. ధనవంతులు, బడా కార్పొరేట్లకు పాలకుల నుంచి మద్దతు లభించటంతో వారిపై కరోనా సంక్షోభ ప్రభావం పెద్దగా ఏమీ లేదు. వారి ఆర్థిక నిర్వహణకు బ్యాంకుల నుంచి మంజూరైన భారీ రుణాలూ ఒక కారణం. కానీ..పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయివేటు అప్పులే దిక్కయ్యాయి. అసంఘటిత రంగంలో భద్రతలేని ఉద్యోగాలు చేసు కుంటూ రోజులు వెళ్లదీస్తున్నాయి.
రైతు కూలీలు, చిన్న సన్నకారు రైతులను నగదు బదిలీ పరిధిలోకి తీసుకురాకపోతే ఈ సమాజం నిలబడలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోన్న నిరుద్యోగం, అధిక ధరల్ని పరిష్కరిం చడానికి దోహదపడుతుందని సూచిస్తున్నారు.
నగదు బదిలీ చేపట్టాలి..
సంక్షోభం తీవ్రతను తెలియజేసే సాధారణ సూచిక 'ప్రజల కొనుగోలు శక్తి'. ఇది గణనీయంగా దెబ్బతిన్నదని, ఇప్పటికీ ఇంకా కోలుకోలేదని ప్రభుత్వ ఏజెన్సీల గణాంకాలే చెబుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఆహార ధరల సూచిక (గ్రామీణ, పట్టణ)లో పెరుగుదల 8.6శాతం. ఇక నిరుద్యోగంపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లెక్కల ప్రకారం,పట్టణ నిరుద్యోగరేటు 7.6శాతం (అన్ని వయస్సులవారివీ)గా ఉంది. యువతలో (15- 29ఏండ్లు) 19శాతానికి చేరుకుంది. ఇదే సమయం లో ఆర్థిక వ్యవస్థ పరిమాణమూ పెరిగింది. దీనిని ఉపాధిరహిత వృద్ధిగా ఆర్థిక నిపుణులు పిలుస్తున్నా రు. ఈ ఏడాది డిసెంబర్‌తో ఉచిత బియ్యం పంపిణీ కూడా ఆగిపోతే పేద కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమచేయాలని, తద్వారా కోట్లాది కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.