Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తపన్‌సేన్
- అంగన్వాడీ జాతీయ మహాసభ ప్రారంభం
మధురై : ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్ స్పష్టం చేశారు. మధురైలో నాలుగు రోజులపాటు జరగనున్న ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్) 10వ జాతీయ మహాసభను మంగళవారం తపన్‌సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ ఉమ్మడి శత్రువును గుర్తించి, ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్ సీఐటీయూ ప్రధాన విభాగాల్లో ఒకటని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం సీఐటీయూ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్ ఎంత పురోగతి సాధించినప్పటికీ, సాధారణ సమస్యలు, అంతరాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని చెప్పారు. సవాళ్లను ఎలా పరిష్కరించాలి, అధిగమించాలి అనేది ఈ మహాసభల సదస్సు యొక్క లక్ష్యమని తెలిపారు. బాబ్రీ మసీదు సంఘటను ప్రస్తావిస్తూ.. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయాలు భారీ మార్పును చూశాయని చెప్పారు. ప్రజలను పణంగా పెట్టి విభజించి పాలించాయని, దీన్ని ఎదిరించి పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. ప్రస్త్తుత కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ రంగాన్నే కాకుండా, ఇతర సంక్షేమ పథకాలనూ లక్షంగా చేసుకుందని, బడ్జెట్ కేటాయింపులను తగ్గించిందని విమర్శించారు. పరిపాలనలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. రైతులు, దినసరి కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరించాలని చూస్తుందని చెప్పారు. రవాణా, విద్యుత్ రంగాలను కూడా ప్రైవేటీకరించారని చెప్పారు. రైతు ఉద్యమం, ఇరాన్లో మహిళా ఉద్యమాలను ప్రస్తావిస్తూ.. కార్మికులు తమ శత్రువులను గుర్తించాలని, ప్రభుత్వాల్లో ఉన్న కార్పొరేట్, మతతత్వ శక్తుల బంధాన్ని బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ రంగాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రజల్ని, దేశాన్ని రక్షించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధు, అధ్యక్షులు యు శరణి, కార్యదర్శి వీణా గుప్తా, కోశాధికారి అంజు మైని ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.