Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న గుజరాత్ బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర
న్యూఢిల్లీ : క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి)లోని 144వ సెక్షన్‌ను ఉల్లంఘించి, ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్న వారిపై పోలీసు అధికారులు ఇక నేరుగా చర్యలు తీసుకోవచ్చు. స్థానిక కోర్టుకు రాతపూర్వకంగా తెలియచేయకుండానే ఆందోళనకారులపై కేసులు నమోదు చేసే అధికారాన్ని కల్పిస్తున్న గుజరాత్ రాష్ట్ర బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రమాదాలను కలగచేస్తాయని భావించే అత్యవసర కేసుల్లో ఆదేశాలు జారీ చేసేందుకు పోలీసులకు, జిల్లా మేజిస్ట్రేట్లకు ఈ 144వ సెక్షన్ అధికారం కల్పిస్తోంది. గతేడాది మార్చిలో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (గుజరాత్ సవరణ) బిల్లు, 2021ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ విధానం నుండి పక్కకు మళ్ళుతోందా లేదా ఏ కేంద్ర చట్టంతోనైనా విభేదిస్తోందా అన్న అంశాలను పరిశీలించాల్సిందిగా కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు. మొత్తంగా భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి), సిఆర్పిసిలను ప్రక్షాళన చేసి వలస కాలం నాటి నిబంధనలను తొలగించేందుకు కేంద్ర హోం శాఖ చురుకుగా పనిచేస్తున్న తరుణంలో వచ్చిన ఈ సవరణకు కేంద్రం ఆమోద ముద్ర లభించింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత, కేంద్ర హోం శాఖ తన అభిప్రాయాన్ని తెలియచేసి, ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి దీనిపై సంతకం చేశారు. దీంతో గుజరాత్లో ఇది చట్టంగా మారేందుకు మార్గం సుగమమైంది. అప్పటి గుజరాత్ హోం మంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా ఈ బిల్లును ప్రతిపాదించారు. వివిధ సందర్భాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు లేదా ఏ వ్యక్తి అయినా నిర్దిష్ట చర్యకు దూరంగా వుండాల్సిందిగా ఆదేశిస్తూ సిఆర్‌పిసిలోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేసే అధికారం పోలీసు కమిషనర్‌కు, జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ బిల్లు కల్పించింది.