Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కార్పొరేట్ల ప్రభుత్వం
- అమరవీరుల జ్యోతి యాత్ర బహిరంగ సభల్లో ఏఐకెఎస్ నాయకులు
అమరావతి : రైతుల ఆత్మహత్యలేనా అద్భుత పాలన అని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని విమర్శించారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతోపాటు మరింత సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. రైతుల పక్షాన ఉంటాయో? కార్పొరేట్ల పక్షాన ఉంటాయో వివిధ రాజకీయ పార్టీలు పున:సమీక్షించుకోవాలని కోరారు. రైతులకు రాయితీలు, మద్దతు ధరల కోసం ఎఐకెఎస్ చేసే పోరాటాల్లో రైతులు భాగస్వామాలు కావాలని కోరారు. ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అఖిల భారత మహాసభ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం జనగాంలోని దొడ్డి కొమరయ్య అమరవీరుల స్తూపం నుంచి సోమవారం ప్రారంభమైన అమరవీరుల జ్యోతి యాత్ర మంగళవారం గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగింది. ఈ యాత్రను రైతులు, కార్మికులు, రైతు సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు ఎక్కడికక్కడే ఘనంగా స్వాగతించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మహిళలు డప్పుకొట్టి స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ కూడలి, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, జిల్లా కేంద్రమైన కర్నూలు, నంద్యాల జిల్లా ఆత్మకూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణప్రసాద్, ఏఐకేఎస్ అఖిల భారత నాయకులు ప్రకాశం మాస్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే తెచ్చిందని, రైతుల కోసం కాదని అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుకోవడానికి రైతు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సందర్భంగా రైతులకు మోడీ ఇచ్చిన హామీ అమలు కావడం లేదని, పైగా విద్యుత్తు సవరణ బిల్లును క్యాబినెట్లో ఆమోదించి పార్లమెంటుకు పంపడం దుర్మార్గమని అన్నారు. ప్రజలందరిపైనా విద్యుత్తు భారాలు పడతాయని తెలిపారు. త్రిసూర్‌లో జరిగే మహాసభలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ జాతా ఉద్దేశమన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారుల ప్రదర్శనలు, ప్రజానాట్య మండలి కళాకారుల గేయాలతో అలరించారు.