Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టే ఉత్తర్వుల్ని సుప్రీం పున:పరిశీలించాలి..
- సీజేఐకి 19 అంతర్జాతీయ సంస్థలు లేఖ
న్యూఢిల్లీ : ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పున:పరిశీలిం చాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి 19 అంతర్జాతీయ సంస్థలు లేఖ రాశాయి. ఆయన అనారోగ్య కారణాల రీత్యా విడుదలను పరిశీలించాలని సోమవారం పంపిన లేఖలో కోరాయి. మావోయిస్టులతో సంబంధం కేసులో జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన స్కాలర్స్ ఎట్ రిస్క్, పలు దేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో కూడిన అంతర్జాతీయ నెట్వర్క్, ఆయా విద్యాసంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. 80శాతం వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా సుదీర్ఘకాలంగా జైల్లో ఉండటంతో అనారోగ్యం తీవ్రంగా ప్రభావితమైందని లేఖలో ప్రస్తావించాయి. పోలియో సహా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రాణాంతకమైన ప్యాంక్రియాటైటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్లకు వెంటనే శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని తెలిపాయి. రెండుమార్లు కరోనా వైరస్లతో పాటు అనేకమార్లు వైద్య చికిత్స పొందలేకపోయారని లేఖలో పేర్కొన్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించినందుకు ప్రతీకారంగా సాయిబాబాను అరెస్టు చేశారని, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలైన పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక, సార్వత్రిక ప్రకటనలో భారత్ భాగమైందని, వాటిని రక్షించాల్సిన అవసరముందని అంతర్జాతీయ సంస్థలు సీజేఐని కోరాయి. సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. 2014 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బాంబే హైకోర్టు సాయిబాబాతోపాటు మరో ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ''ఉగ్రవాదం జాతీయ భద్రతకు ముప్పు. చట్టబద్ధమైన బలగాలతో దానికి చెక్ పెట్టాలి. అయితే పౌర ప్రజాస్వామ్యం నిందితులకు కల్పించిన విధానపరమైన భద్రతలను త్యాగం చేయదు'' అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆ మరుసటి రోజే తీర్పుపై సుప్రీం స్టే ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసుపై డిసెంబర్ 8న సుప్రీం విచారణ జరపనున్నది.