Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ సమాన అవకాశం కల్పించాలి
- ప్రతిపక్షాలవైపూ చూడాలి
- రాజ్యసభ చైర్మెన్ ధంఖర్‌కు ప్రతిపక్షాల సూచన
- ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారు : ప్రధాని మోడీ
- ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : రాజ్యసభ చైర్మెన్‌గా ప్రతిపక్షాల వైపూ చూడాలని జగదీప్ ధంఖర్‌కు ప్రతిపక్ష నేతలు సూచించారు. రాజ్యసభ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టి మొదటి రోజు (బుధవారం) రాజ్యసభకు వచ్చిన జగదీప్ ధంఖర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేతలు శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రాజ్యసభతో పాటు దేశం తరపున తాను చైర్మెన్‌ను అభినందిస్తున్నాననీ, పోరాటాల మధ్య జీవితంలో మీరు ఈ దశకు చేరుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారనీ, దేశంలోని అనేక మందికి ఆయన స్ఫూర్తిని అన్నారు. జగదీప్ ధంఖర్ రైతు కుటుంబానికి చెందిన వారని, ఆయన సైనిక్ స్కూల్లో చదివారని అందువల్ల ఆయనకు జవాన్లు, రైతులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇండియా జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయంలో ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయనీ, జీ-20 సదస్సుకు సన్నద్ధం కావాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారనీ, ఆమె కంటే ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారని తెలిపారు. జగదీప్ ధంఖర్‌కు చట్టపరమైన విషయాలపైనా గొప్ప అవగాహన ఉందని అన్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ దేశంలో రెండో అతిపెద్ద రాజ్యాంగ పదవికి బాధ్యత వహించినందుకు ప్రతిపక్ష సభ్యుల తరపున తాను అభినందిస్తున్నానని అన్నారు. రాజ్యసభను ఆలోచనల గది అని, చర్చల్లో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇవ్వాలని అన్నారు. మిగతా పాత్రల కంటే రాజ్యసభ సంరక్షకుడిగా జగదీప్ ధంఖర్ పాత్ర చాలా పెద్దదని అన్నారు. ఆయన కూర్చున్న సీటుపై పలువురు ప్రముఖులు కూర్చున్నారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా ఈ సభలో మంచి అనుభవం ఉన్న ఏకైక సభ్యుడిని తానేనని, కానీ తనకు మాట్లాడే అవకాశం రావడం చాలా కష్టమని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతులో నడపాలి : సీపీఐ(ఎం)
సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం మాట్లాడుతూ సభను పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులో నడపాలనీ, అప్పుడే సభకు అంతరాయం కలగదని అన్నారు. ప్రజా సమస్యలను ఈ సభలో ప్రతబింభించడమే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ విధానం, ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించాలని సూచించారు. సభలో పార్టీకున్న సభ్యలను బట్టీ సమయం ఇవ్వడం సమర్థనీయం కాదనీ, అన్ని పార్టీలకు, స్వతంత్రులకు సమాన అవకాశం ఇవ్వాలని కోరారు. చైర్మెన్‌కు సహకరించాలనీ, అంతేతప్ప చైర్మెన్ స్థాయిని తగ్గించకూడదని అధికార పార్టీకి సూచించారు. టీఆర్ఎస్ నుంచి కే.కేశవరావు మాట్లాడారు. అనంతరం చైర్మన్ జగదీప్ ధంఖర్ మాట్లాడుతూ నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ 2015లో కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. ఇది పార్లమెంటరీ సార్వభౌమాధికారం ''తీవ్రమైన రాజీష'', ''ప్రజల ఆదేశం'' విస్మరించడానికి ఉదాహరణ అన్నారు. లక్ష్మణ రేఖను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడంతో రాజ్యాంగ సంస్థల సమన్వయ పనితీరును ప్రోత్సహించాలని అన్నారు. శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమిష్టిగా పనిచేస్తే మంచిదని తెలిపారు.
రాజ్యసభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వైల్డ్ లైఫ్ (రక్షణ) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల ప్రతినిధులు చర్చించిన తరువాత, మిగతా చర్చను నేడు (గురువారం) కొనసాగిస్తారు. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, లోక్‌సభలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విదేశీ విధానంపై ప్రకటన చేశారు.
లోక్‌సభలో ఇటీవల మరణించిన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణ తదితరులకు నివాళులర్పించారు. అనంతరం గంటపాటు లోక్‌సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో జీరో అవర్ జరిగింది. లోక్‌సభలో మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లును కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్, కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, టీఎంసీ ఎంపీ సౌగత్ రారు, డీఎంకే ఎంపీ టిఆర్ బాలు తదితరులు వ్యతిరేకించారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యాంటీ మారిటైమ్ పైరసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల ఎంపీలు చర్చించారు. మిగతా చర్చను నేడు (గురువారం) కూడా చర్చించనున్నారు.