Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ మేయర్ పీఠంపై ఆప్
- మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్-134 ..బీజేపీ-104 స్థానాలు
- 15ఏండ్ల పాలనతో విసిగిపోయిన నగర పౌరులు
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ పాలనతో విసిగివేశారిపోయిన నగర పౌరులు మార్పును కోరుకున్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 134 వార్డ్ స్థానాల్లో విజయం సాధించి..మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. గత 15ఏండ్లుగా నిరాఘాటంగా అధికారాన్ని అనుభవించిన బీజేపీకి 104 స్థానాలు దక్కాయి. మొత్తం 250 వార్డ్ స్థానాలున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 4న ఎన్నికలు జరిగాయి. దీంట్లో ఆప్‌కు ఓటర్లు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. మూడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఢిల్లీలో ఇంతకు ముందు మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి. ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లను విలీనం చేశాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 42.05శాతం, బీజేపీకి 39.09శాతం, కాంగ్రెస్‌కు 11.68శాతం ఓట్లు లభించాయి.
తాజా ఎన్నికల ఫలితంపై కేజ్రీవాల్ స్పందిస్తూ..''ఆప్ గెలుపునకు సహకరించిన మద్దతుదారులకు, ఓటర్లకు కృతజ్ఞతలు. ఓటర్లు మార్పును కోరుకున్నారు. వారికి రుణపడి ఉంటా''నని అన్నారు. గెలిచినవారందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రధాని మోడీ ఆశీర్వాదం, కేంద్ర సహకారం ఉంటుందని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు.
గత 15 ఏండ్లుగా బీజేపీ పాలనతో మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయిందని అత్యధికశాతం మంది ఓటర్లు భావించారు. చెత్తాచెదారం తొలగింపు, రోడ్లపై గుంతలు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం..మొదలైన వాటిపై ప్రజల నుంచి ఫిర్యాదుల వస్తున్నా బీజేపీ నాయకులు పట్టించుకోలేదు. దీంతో ఈ అంశాలనే ఆప్ ప్రచారాస్త్రాలు మలుచుకుంది. వీటిని పరిష్కరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచే ఆప్ కార్యకర్తలు రంగంలోకి దిగి పనిచేయటం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. బీజేపీ పాలిత కార్పొరేషన్లలో చెత్త పేరుకుపోవటాన్ని ఆప్ చర్చనీయాంశం చేసింది. ఓటర్ల దృష్టికి తీసుకెళ్లింది. పారిశుద్ధ వ్యర్థాల నిర్వహణకు శాస్త్రీయ పరిష్కారం చూపిస్తామని కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఓట్లను రాబట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.