Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ఆ నిర్ణయానికి సంబంధించిన సమాచారమంతా ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ : 2016 నాటి నోట్లరద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులన్నింటినీ సమర్పించాలని ఆర్బీఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఆనాటి రూ.1000, రూ.500 నోట్ల రద్దు అంశానికి సంబంధించిన సమాచారమంతా తెలపాలని బుధవారం ఆదేశించింది. నోట్లరద్దు ప్రక్రియ చేపట్టడానికి ముందే ఆర్బీఐతో అన్ని విధాలుగా సంప్రదింపులు జరిపామని, ముందస్తు ఏర్పాట్లు చేశామని సుప్రీంకోర్టుకు ఇంతకుముందు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. నకిలీ నోట్లు, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం, పన్ను ఎగవేతలు..మొదలైనవాటిని అరికట్టడం కోసం నోట్లరద్దు చేపట్టామని పేర్కొంది. ఈనేపథ్యంలో దీనికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆర్బీఐ, కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసులో ధర్మాసనం మంగళవారం కీలకవ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు తీసుకునే ఆర్థిక నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేసే అవకాశం చాలా పరిమితమంటే, దానర్థం న్యాయస్థానాలు చేతులు ముడుచుకొని కూర్చోవటం కాదని చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమీక్ష చేసే అవకాశముందని తెలిపింది.మోడీ సర్కార్ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, ఆర్బీఐ కౌన్సిల్, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పి.చిదంబరం, శ్యాం దివాన్ తదితరులు తమ వాదనలు ధర్మాసనం ముందుంచారు. ఈనేపథ్యంలో డిసెంబర్ 10కల్లా రాతపూర్వకంగా సంబంధిత సమాచారాన్ని కోర్టు ముందుంచాలని ఆర్బీఐ, కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.
కేంద్రం ఇష్టమున్నట్టు చేయరాదు : పి.చిదంబరం
నోట్ల రద్దు నిర్ణయం ప్రకటిస్తూ మోడీ సర్కార్ చేపట్టిన ప్రక్రియ అంతా తప్పుల తడకగా సాగింది. ఇదంతా లోప భూయిష్టంగా ఉంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ రికమెండేషన్ లేకుండా కేంద్రం తనంత తానుగా ఇష్టమున్నట్టు చేయడానికి వీల్లేదు. అందునా ఆర్థికపరమైన ఒక విధాన నిర్ణయాన్ని ఏకపక్షంగా ఆర్బీఐపై కేంద్రం రుద్దింది. ఇదిలా ఉండగా నోట్లరద్దు అంశాన్ని సుప్రీం విచారణ చేయటమేంటి? అని కేంద్రం వాదనలు వినిపించింది. గతాన్ని తవ్వి చేసేదేమీ లేదని చెప్పింది. గడియారంలో ముల్లును వెనక్కి తిప్పటం, గుడ్డు పగిలిన తర్వాత..దానిని పూర్వపు స్థితికి తీసుకురావటం.. ఎవ్వరికీ ఉపయోగం లేని పనులని కేంద్రం వాదించింది.