Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరం వివాదంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
- ఫిబ్రవరి 15కు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల మధ్య నెలకొన్న అంతర్ రాష్ట్ర వివాదంపై నివేదికను రెండు నెలల్లో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏకాభిప్రాయం కుదురుతుందో, లేదో తెలుసుకోవడానికి సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని కోర్టుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రేలా స్వచ్ఛంద సంస్థ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సులను ఉల్లంఘించిందని, ఈ ప్రాజెక్టు వల్ల ఒరిస్సాలో నివసిస్తున్న ప్రజలు నీటి మునిగిపోయే ప్రమాదం ఉందని ఒరిస్సా ఆరోపిస్తోంది. ఇతర రాష్ట్రాలు తమ ఏకాభిప్రాయం లేకుండానే అంగీకరిచిన ప్రణాళికకు ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేశాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల మధ్య చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది.
తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల సమస్యలను లేవనెత్తారు. దీనివల్ల భారీ నష్టం జరిగిందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రక్షణ చర్యలు చేపడితే, పోలవరం నిర్మాణానికి ఏమీ అభ్యంతరం లేదని తెలిపారు. ఛత్తీస్గఢ్ తరపు న్యాయవాది కూడా తమ అభ్యంతరాలు తెలిపారు. సమావేశంలో ఒరిస్సా లేవనెత్తిన అభ్యంతరాలనే తామూ కూడా లేవనెత్తామని అన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. డిసెంబర్ 2న రాష్ట్రాల నుంచి సాంకేతిక అంశాలపై అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. కాగా, కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.