Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లులపై సమగ్ర పరిశీలన అవసరం
- చర్చలకు ప్రతిపక్షాలు పూర్తి సహకారం
- 12 ప్రతిపక్షాల భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమవేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. బుధవారం నాడిక్కడ పార్లమెంట్లో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్షనేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన ఈ సమావేశంలో ధరల పెరుగదలపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా నిలదీయాలని నిర్ణయించాయి. అలాగే నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై దాడి వంటి ఇతర అంశాలను ఉమ్మడిగా లేవనెత్తాలని నిర్ణయించాయి. అనంతరం ఖర్గే మాట్లాడుతూ పార్లమెంటు ప్రజాస్వామ్య చర్చలకు నిలయమని అన్నారు. భావసారూప్యత గల పార్టీలు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను గట్టిగా లేవనెత్తుతామని అన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. హడావుడిగా చట్టాలు రూపొందిస్తే.. అవి న్యాయపరమైన పరిశీలనను వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. కాబట్టి, అన్ని ముఖ్యమైన బిల్లులను జాయింట్, సెలెక్ట్ కమిటీలకు పంపాలని తాము ఆశిస్తున్నామనీ, తద్వారా అవి సమగ్రంగా పరిశీలించబడతాయని చెప్పారు. పార్లమెంటరీ ప్రక్రియలు, చర్చలలో పూర్తి సహకారం అందించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సమావేశంలో కె. సురేష్, గౌరవ్ గొగొరు (కాంగ్రెస్), టిఆర్ బాలు (డీఎంకే), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫెరెన్స్), ఎమారం కరీం (సీపీఐ(ఎం)), సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), సంజరు సింగ్ (ఆప్), వందనా చౌహాన్, ఫౌజియా ఖాన్ (ఎన్సీపీ), వైకో (ఎండీఎంకే), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), ఐయుఎంఎల్, శివసేన ఠాక్రే, ఆర్ఎల్డి పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.