Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అధికారంలో ఉండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో రెండు రోజుల క్రితం ఓటమి పాలైన బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ అదే బాట పట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ప్రజానీకం బీజేపీని తిరస్కరించారు. గురువారం నాడు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పొయింది. ముందునుండి ఊహించినట్టుగానే గుజరాత్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు కూడా పెరిగాయి. స్వరాష్ట్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం నాడే వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కమలదళానికి తీవ్ర భంగపాటు ఎదురైంది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, వాటిలో ఒక లోక్‌సభతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రతిపక్షాలు కైవసం చేసుకున్నాయి. కేవలం రెండు శాసనసభ స్థానాల్లోనే బీజేపీ గెలుపొందింది. అయితే, బీజేపీతో పాటు కార్పొరేట్ మీడియా కూడా గుజరాత్ గెలుపునే భారీగా ప్రచారం చేస్తూ మిగిలిన ఫలితాలను ప్రజల దృష్టికి రాకుండా చేసే విన్యాసాన్ని ప్రారంభించాయి.
హిమాచల్‌లో ఆరు శాతం ఓట్లు కోల్పోయిన బీజేపీ
బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఆరుశాతం ఓట్లను కోల్పోయింది. 60 స్థానాలున్న ఈ రాష్ట్ర శాసనసభకు 2017లో జరిగిన ఎన్నికల్లో 49.53 శాతం ఓట్లతో 44 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గురువారం నాడు ఫలితాలు వెలువడిన తాజా ఎన్నికల్లో 43 శాతం ఓట్లతో 25 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో 42.32 శాతం ఓట్లతో 21 స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో 43.90 శాతం ఓట్లతో 40 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంమీద కాంగ్రెస్‌కు గత ఎన్నికలతో పోలిస్తే 19 స్థానాలు అదనంగా లభించాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారాన్ని మార్చే అలవాటున్న ఈ రాష్ట్రంలో ఈ సారి రెండవసారి కూడా తామే గెలుస్తామని బీజేపీ ప్రకటించింది. మోడీ-అమిత్‌షా ధ్వయం స్వయంగా ప్రచారంలోకి దిగి డబుల్ ఇంజన్ నినాదాన్ని ఇచ్చారు. మరోవైపు సీనియర్ నేత వీరభద్రసింగ్ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ సమస్య వెంటాడింది. అయినా, ఒక వ్యూహం ప్రకారం ప్రచారంచేయడంతో పాటు, స్థానిక అంశాలను, సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ విజయధుంధుభి మోగించింది. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారానికి రాకపోవడంతో ప్రియాంకగాంధీ ముమ్మరంగా పర్యటించారు. ఇక్కడ తొలిసారి పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.
గుజరాత్లో ఆప్‌తో బీజేపీకి లబ్ది
గుజరాత్లో ముందునుంచి ఊహించినట్లుగానే బీజేపీ గెలుపొందింది. నరేంద్రమోడీ, అమిత్‌షాలు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో పాటు, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక వ్యూహం ప్రకారం నిర్వహించిన ప్రచారం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఆప్, ఎంఐఎంలు పోటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పనికి వచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీకి 156 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ 17 స్థానాలకు పరిమితం అయింది. ఆప్ ఐదు స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 57 స్థానాలు పెరిగాయి.
కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్‌కు 15.67 శాతం ఓట్లు తగ్గగా, బీజేపీకి 3.06 శాతం ఓట్లు పెరిగాయి.. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యింది. ఆప్ భారీగా ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ తన సీట్లు, ఓట్లను కోల్పోయింది. అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో అడుగుపెట్టడంతో బిజెపి గుజరాత్ ప్రైడ్ (గౌరవం)ను ప్రచారంలోకి తీసుకొచ్చింది. గుజరాత్‌పై బయట వ్యక్తుల ఆధిప్యం సహించకూడాదని ప్రజల్లో చర్చకు తెరలేపింది. దీని ఫలితంగా బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని భావిస్తున్నారు. 1950 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటమి చెందింది.సూరత్, తాపి, భరూచ్ జిల్లాల్లోని 27 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడాన్ని ఈ ప్రాంతంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో కాంగ్రెస్ నేత రఘు శర్మ గుజరాత్ ఏఐసీసీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు.