Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈపీఎఫ్ఓలో కార్మికులందరినీ చేర్చాలి : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) పార్లమెంట్ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ ఈపీఎఫ్ఒ పెన్షన్ స్కీమ్ అసంఘటిత రంగంతో పాటు కార్మికులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ 2014 సవరణలను వర్తింపచేయాలని, నాలుగు నెలల్లో చేరని వారంతా ఈపీఎఫ్ఒ సభ్యులుగా చేరేందుకు మరొక అవకాశం కల్పిస్తూ 2022 నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు తరువాత కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఒ ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. అందువల్ల ఇప్పటికీ పెన్షనర్లు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కనీస పెన్షన్‌ను రూ.1,000 చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఒ నిర్ణయం తీసుకుందని, 70 లక్షల మంది పెన్షనర్లలో 30 లక్షల మంది పెన్షనర్లు రూ.1,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఇది దారుణమైన పరిస్థితి అని తెలిపారు. ప్రతి నెలకు కనీస పెన్షన్ 9,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈపిఎఫ్ఒ స్కీంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరినీ చేర్చాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక విధానాల వల్ల కేరళ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, దీని ఫలితంగా కేరళ రెవెన్యూ రూ.32 వేల కోట్ల తగ్గిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సామాజిక భద్రత చర్యలు చేపడుతోందని తెలిపారు. జీఎస్టీ పరిహారం మరో ఐదేండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో చర్చ అనంతరం వైల్డ్‌లైఫ్ సంరక్షణ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ ప్రవేశపెట్టారు.