Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
న్యూఢిల్లీ : నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనే ప్రధానమని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తిలో రాష్ట్రాలే ప్రధాన భూమిక పోషించాలన్నారు. అనుసంధానంపై రాష్ట్రాలతో కేంద్రం విస్తృత సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. గురువారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వైసీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఆదాల ప్రబాకర్ రెడ్డిలు సహా పలువురు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మహానది, బ్రహ్మపుత్రలో బేసిన్‌లోని మిగులు జలాలను గోదావరికి తరలించి, అటు నుంచి గోదావరి నీటిని కృష్ణా, పెన్నా, కావేరిలకు తరలించాలని ప్రభుత్వ ప్రతిపాదనగా ఉందని, అయితే మహానది,గోదావరి, గోదావరి-కృష్ణా అనుసంధాన ప్రక్రియపై ఏకాభిప్రాయం కుదరనందున ఈ అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు.
అయితే గోదావరిలో ఉన్న మిగులు జలాలను, ఇంద్రావతిలో వినియోగించలేని జలాలను మళ్లిస్తూ గోదావరి(ఇచ్ఛంపల్లి)-కావేరి (గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానించే ప్రత్యామ్నాయ అధ్యాయాన్ని జాతీయ జల వనరుల సంస్థ (ఎన్‌డబ్ల్యుఏ) పూర్తి చేసిందని వివరించారు.
ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్రాలను సంప్రదించి తయారు చేసినప్పటికీ, గోదావరిలో మిగులు జలాల లభ్యత, జలాల కేటాయింపుపై రాష్ట్రాలు అభ్యంతరాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిందనీ, గోదావరి నుంచి 7వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని 4వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటికి తగ్గిస్తూ సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక (టిఎఫ్ఆర్) తయారు చేసిందని వివరించారు. అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న లింకులలో ఇది ఒకటని తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంతో మొత్తంగా బేసిన్‌లోని 9.44లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగు నీరందించవచ్చని, ఇందులో తెలంగాణ, ఏపీ, తమిళనాడులోని 6.23లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని 1.88కోట్ల ప్రజల పారిశ్రామిక, గహ అవసరాలు తీరుతాయని తెలిపారు. మధ్యస్తంగా కృష్ణా బేసిన్‌ను సప్లిమెంటేషన్ చేసేందుకు బెడ్తీ-వెర్ధా లింక్‌ను ప్రతిపాదనను తెచ్చామని, దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. బెడ్తీ-వెర్థా లింక్ ద్వారా కర్ణాటకలో 1.05లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుందని, 5లక్షల ప్రజల గహావసరాలు తీరుతాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన భూమి, నిధులు, పరిహారం మొదలైనవి ప్రాజెక్ట్ అమలు సమయంలో పరిగణనలోకి వస్తాయన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియతో ఇప్పటికే ఉన్న సాగునీటి, తాగునీటి పథకాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని వెల్లడించారు.