Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలీజియం..న్యాయ వ్యవస్థ పరిధిలోని అంశం : సుప్రీంకోర్టు
- తమను తాము నియంత్రించుకోవాలని వారికి చెప్పండి...
న్యూఢిల్లీ : 'కొలీజియం వ్యవస్థ'కు వ్యతిరేకంగా మోడీ సర్కార్ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందని కేంద్రానికి తెలిపింది. కొలీజియం సిఫారసులను కేంద్రం తిరస్కరించటాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గురువారం ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. కొలీజియం వ్యవస్థ ఏర్పాటును సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు కేంద్రం కట్టుబడి ఉండాలని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌కు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, ఎ.ఎస్.ఓకా, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కొలీజియంకు వ్యతిరేకంగా మాట్లాడరాదని తెలిపింది. ఉపరాష్ట్రపతి, కేంద్ర న్యాయమంత్రి చేసిన వ్యాఖ్యల్ని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ''కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది చేసిన ప్రసంగాల్ని విక్రమ్ సింగ్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధమైన వ్యాఖ్యలు సరైనవి కాదు. వీటిని మేం తేలిగ్గా తీసుకోవటం లేదు. తమను తాము నియంత్రించుకోవాల్సిన అవసరముందని మీరు వారికి సలహా ఇవ్వండి'' అంటూ అటార్నీ జనరల్‌కు ధర్మాసనం తెలిపింది. కొలీజయం వ్యవస్థను తప్పుబడుతూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం చెల్లదని సుప్రీం తీర్పు చెప్పటం దారుణమని, ఇది చాలా పెద్ద తప్పని ఉపరాష్ట్రపతి ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''కొలీజియం దేని ఆధారంగా ఏర్పాటైందో చెప్పండి. న్యాయమూర్తుల్ని మీరే ఎంపికచేసుకోండి. ప్రభుత్వాన్ని ఏమీ అడగొద్దు..'' అంటూ కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు ఒక ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.