Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
- పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు చేయాలి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ కన్వెన్షన్లో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత
న్యూఢిల్లీ : నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి జాతీయ కన్వెన్షన్ డిమాండ్ చేసింది. గురువారం నాడిక్కడ తల్కోటర స్టేడియంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ) సంయుక్త జాతీయ కన్వెన్షన్ జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని సదస్సు తీర్మానించింది. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు దేశవ్యాప్త ఉమ్మడి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా 2023 మే, జూన్లలో ప్రచారం నిర్వహించాలనీ, జూలై, ఆగస్టులో రాష్ట్ర స్థాయి జాతాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్లో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసిందని విమర్శించారు. ఒకపక్క ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ప్రయోజనాలకు ఎకనామం పెడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో కోట్లాది మంది కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయారని దుయ్యబట్టారు. సైన్యం వంటి కీలక రంగాలతో పాటు అన్ని రంగాల్లో కాంట్రాక్టీకరణ, అవుట్ సోర్సింగ్ భారీగా పెంచిందని విమర్శించారు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, మంత్రిత్వ శాఖల్లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం వంటి రాజ్యాంగ విలువలకు పాతరేస్తూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. బడా కార్పొరేట్లకు రాయితీలు, రుణ మాఫీలు చేస్తున్న మోడీ ప్రభుత్వం, పేదలపై భారాలు వేస్తోందని విమర్శించారు.