Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా అన్ని ప్రతిపక్ష పార్టీలు పాఠం నేర్చుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. అన్ని శక్తులను కలుపుకుని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి ధీటుగా సమర్థవంతమైన ఐక్య ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించాలని పొలిట్ బ్యూరో సూచించింది. ఎన్నికల ఫలితాలపై పొలిట్ బ్యూరో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ, మిగిలిన రెండు (హిమాచల్ ప్రదేశ్, డీఎంసీ) ఎన్నికల్లో ఓటమి పాలైంది. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ - ఆర్ఎస్ఎస్ రాష్ట్రంలో సుస్థిరపరిచిన తీవ్రమైన మత విభజనలే గుజరాత్లో బీజేపీ ఏడోసారి విజయం సాధించడానికి నిదర్శనమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వరుసగా దేవాలయాల పర్యటనతో హిందువుగా చిత్రీకరించిన విధానం... ధరల పెరుగుదల, నిరుద్యోగం, వైద్య, విద్య సదుపాయాల కొరత వంటి సమస్యలు మరుగునపడేలా చేశాయని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో తిరిగి అధికారం నిలుపుకునేందుకు అన్ని వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకున్న బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. బీజేపీ దుష్పరిపాలన అక్కడి ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని.. దీంతో కాంగ్రెస్‌కు విజయం అందించారని పేర్కొంది.15 ఏండ్లుగా కార్పొరేషన్‌ను అంటిపెట్టుకున్న బీజేపీ దూషణలను, కుయుక్తులను ఢిల్లీ ప్రజలు వ్యతిరేకించడంతో ఢిల్లీలో ఏకీకృత కార్పొరేషన్లో ఆప్ విజయానికి కారణమైందని పేర్కొంది. బీజేపీకి భారీ ధన బలం, వనరులు ఉన్పప్పటికీ హిమాచల్, ఢిల్లీ ఫలితాలు ఆ పార్టీ బలహీనతను బహిర్గతం చేశాయని, అలాగే మోడీ పరిమితులను కూడా తెరపైకి తీసుకువచ్చాయని తెలిపింది.