Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు రూ.9,000 పెన్షన్ ఇవ్వాలి
- ఈపీఎఫ్ పెన్షనర్ల పార్లమెంట్ మార్చ్
- సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల ఎంపీలు
న్యూఢిల్లీ :వివక్ష లేకుండా పెన్షన్ ఇవ్వాలనీ, నెలకు కనీస పెన్షన్ రూ.9,000 నిర్ణయించాలని ఈపీఎఫ్ పెన్షనర్ల ఆందోళన చేపట్టారు. గురువారం జంతర్ మంతర్‌లో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, గోవా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల నుంచి పెన్షనర్లు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, పిఆర్ నటరాజన్, ఐయుఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, డీఎంకే ఎంపీలు షణ్ముగం, రవికుమార్, కాంగ్రెస్ ఎంపీ ఎంకె రాఘవన్, మహారాష్ట్ర ఎంపీ గావిట్ తదితరులు సంఘీభావం తెలిపారు. పెన్షన్ 12 నెలల పాటు ఇవ్వాలని, ఈపీఎస్95ని సమగ్రంగా సవరించాలని, ఉచిత వైద్యం, రైల్వే ప్రయాణానికి సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ఓ, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నాయని ఎంపీలు విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం హైయర్ పెన్షన్ ను అమలు చేయాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని పెన్షనర్ల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అతుల్ డిఘే అధ్యక్షత వహించగా, కో ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఎం ధర్మజన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిమాండ్లపై సహేతుకమైన పరిష్కారం లభించకుంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలని సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆందోళనలో జాతీయ ఉపాధ్యక్షులు అతుల్ ధిగే, మనోహర్ జాదవ్, భీమారం డోంగ్రే, ప్రకాష్ యెండే, భాగ్యధర్ బ్రహ్మ, డి.మోహనన్, కెపి బాబు, కనకరాజ్, సూరి, బికె చక్రవర్తి, ఎంఆర్ యాదవ్, సుకుమారన్, తెలంగాణ రాష్ట్ర టిపిఆర్పిఎ అధ్యక్షుడు క్రిష్ణమూర్తి,,ఆంధ్రప్రదేశ్ నుంచి ఎపిఆర్‌పిఎ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్, ఒడిశా నుంచి బ్రహ్మ, ఢిల్లీ నుంచి ఖేమ్ సింగ్ అబ్రాల్, వివిధ సంఘాల జాతీయ నాయకులు టిపి ఉన్నికుట్టి, జోస్ అటుపురం, సి.ప్రభాకరన్ తదితరులు కూడా మాట్లాడారు.