Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంపై పుస్తకావిష్కరణలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : హేతుబద్ధమైన ఆలోచనను నాశనం చేయడానికి ఓ క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో 'ఎడ్యూకేషన్ ఆర్ ఎక్స్‌క్లూజన్?, ది ప్లైట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్' పుస్తకాన్ని సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, నిలోత్పల్ బసు విడుదల చేశారు. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, కానీ నూతన విద్యా విధానంపై రాష్ట్రాలతో కేంద్రం చర్చించలేదని విమర్శించారు. హేతుబద్ధ ఆలోచనను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అంగన్వాడీ నుంచి ఉన్నత విద్య వరకు ఈ పుస్తకం కొత్త బోధనా విధానం ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. చరిత్ర అధ్యయనాన్ని కేవలం హిందూ పురాణాల చరిత్ర, తత్వశాస్త్రాన్ని హిందూ తత్వశాస్త్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఏకకాలంలో విద్యా ప్రయివేటీకరణ, కాషాయీకరణ : ప్రకాశ్ కరత్
నూతన విద్యా విధానం ఏకకాలంలో విద్యా ప్రయివేటీకరణ, కాషాయీకరణకు దారితీస్తాయని ప్రకాశ్ కరత్ విమర్శించారు. ఈ పుస్తకం నూతన విద్యా విధానం ప్రమాదకరమైన మాస్టర్ ప్లాన్‌ను వెల్లడిస్తుందనీ, ఇది విద్యా వ్యవస్థలను ప్రీ-ప్రైమరీ నుంచి పరిశోధన స్థాయికి మార్చడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీలను విద్యారంగం నుంచి దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. నిలోత్పల్ బసు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ విద్యా రంగాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, యూనివర్సిటీల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ నేతలు నితీష్ నారాయణన్, దీప్సితా ధర్, లెఫ్ట్‌వర్డ్ బుక్ మేనేజింగ్ ఎడిటర్ సుధన్వ దేశ్‌పాండే మాట్లాడారు. మాజీ ప్రధాన కార్యదర్శి విక్రమ్ సింగ్, ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తదితరులు మాట్లాడారు. ఈ పుస్తకాన్ని ఎస్ఎఫ్ఐ పత్రిక స్టూడెంట్ స్ట్రగుల్, రీసెర్చ్ పబ్లికేషన్ ఇండియన్ రీసెర్చర్, లెఫ్ట్ వర్డ్ బుక్స్ సంయుక్తంగా ముద్రించాయి. ఈ పుస్తకాన్ని స్టూడెంట్ స్ట్రగుల్ ఎడిటర్ నితీష్ నారాయణన్, ఇండియన్ రీసెర్చర్ ఎడిటర్ దీప్షితా ధర్ ఎడిట్ చేశారు. లెఫ్ట్‌వర్డ్ బుక్స్ వెబ్సైట్ నుండి పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.