Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ
- తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్-2020 (ఉమ్మడి పౌరస్మతి) ప్రయివేట్ బిల్లును రాజ్యసభలో బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా ప్రవేశపెట్టారు. కాగా, ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం), ఐయూఎంఎల్, ఎండీఎంకే నోటీసులు ఇచ్చాయి. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహించారు. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 23 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ... భారత్ లౌకిక దేశమనీ, దేశ ప్రజలందరికీ రాజ్యాంగ రక్షణ కల్పిస్తున్నదని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ వివాదస్పదమైనదని అన్నారు. అనేక రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయనీ, కానీ వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటం లేదని విమర్శించారు. ఏదైనా బిల్లు తీసుకురావాలంటే, ముందు వివిధ వర్గాలతో సంప్రదింపులు, చర్చలు జరగాలనీ, కానీ అలా జరగలేదని అన్నారు. ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే.. పరిస్థితులు చేయిదాటిపోతాయని తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య మాట్లాడుతూ... దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారా? లేక భిన్నత్వంలో ఏకత్వం ధ్వంసం కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలపైన బలవంతంగా జొప్పిస్తే, దేశ నిర్మాణం నిర్వీర్యమవుతుందన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ మాట్లాడుతూ... దేశం ఇటుకలు, రాళ్లతో నిర్మించలేదనీ, స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో నిర్మించామనేది తెలుసుకోవాలన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదం ప్రధాని మోడీ ఇచ్చారనీ, అయితే ఈ బిల్లు ఆ నినాదం స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఆ విషయం కేంద్ర న్యాయ మంత్రికి తెలుసనీ, సుప్రీంకోర్టుపై దాడికి దిగుతున్న ఆయన దీని గురించి ఆలోచించాలని అన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం మాట్లాడుతూ ఇది సంఘపరివార్ రాజకీయ కసరత్తని అన్నారు. ఎండీఎంకే నేత వైకో మాట్లాడుతూ దేశంలో చాలా విశ్వాసాలు, చాలా మతాలు, చాలా భాషలు, చాలా సంస్కృతులు ఉన్నాయనీ, దేశభక్తి బీజేపీకి సంబంధించిన ఏకస్వామ్యం కాదని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఒకదాని తరువాత ఒకటి అమలు చేస్తున్నారనీ, కాశ్మీర్‌ను ఖతం చేశారనీ, ఇప్పుడు సివిల్ కోడ్‌పై పడ్డారని విమర్శించారు. ఇప్పుడు మెజార్టీ ఉండటంతో బుల్డోజ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లు దేశానికి ప్రమాదకరమనీ, దీన్ని ఉపసంహరిం చుకోవాలని కోరారు. ఐయూఎంఎల్ నేత అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తీసుకొచ్చారనీ, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయలేరని అన్నారు. దీనివల్ల అసహనం పెరుగుతుందని తెలిపారు. కనుక దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, సీపీఐ, డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, ఎన్సీపీ పార్టీలు కూడా వ్యతిరేకించాయి.