Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా కస్టడీని ఢిల్లీ కోర్లు మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం తీహార్జైలులో ఉన్న అఫ్తాబ్‌ను శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాకేత్ కోర్టులో హాజరు పరిచామని అధికారులు తెలిపారు. అతన్ని వ్యక్తిగతంగా హాజరుపరచాల్సి ఉండగా, భద్రతా కారణాలతో నిర్ణయం మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్తాబ్ తన సెల్‌ను మరో ఇద్దరు ఖైదీలతో పంచుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేసు దర్యాప్తులోని ఓ అధికారి అఫ్తాబ్ చాలా తెలివైనవాడని.. కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అంతకుముందు డిసెంబరు 1న అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించగా, శ్రద్ధాను హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే పరీక్ష సమయంలో శ్రద్ధా దుస్తులను ఎక్కడ పారవేశాడో కూడా వెల్లడించాడు.
అఫ్తాభ్ను ఉరితీయాలి : శ్రద్ధా తండ్రి డిమాండ్
కాగా, తన కుమార్తెను హత్య చేసిన విధంగానే అఫ్తాబ్‌ను శిక్షించాలని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో తగిన విచారణ జరిపి, అతనిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఫ్తాబ్‌ను కోర్టులో హాజరు పరచనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అఫ్తాబ్ కుటుంబసభ్యులతో పాటు ఈ దారుణ హత్యలో ప్రమేయం ఉన్న ఇతరులపై కూడా విచారణ జరపాలని కోరారు. 18 ఏళ్లు దాటిన యువతీ, యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, అలాగే ఇబ్బందులకు గురిచేస్తున్న మొబైల్ యాప్‌లపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.