Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 720 మంది ప్రతినిధులు
- హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు
- 13న బహిరంగ సభకు హాజరుకానున్న త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
- మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వెల్లడి
న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 13 నుంచి 16 వరకు ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభ నిర్వహించనున్నట్టు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సాను, బిశ్వాస్ మాట్లాడారు. 13న విద్యార్థి ర్యాలీ నిర్వహిస్తామనీ, అనంతరం మల్లు స్వరాజ్యం నగర్లో బహిరంగ సభ జరుగుతోందని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిధిగా మొదటి ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పాల్గొంటారని తెలిపారు. అభిమన్యు, ధీరజ్, అనీస్ ఖాన్ మంచ్‌లో ప్రతినిధుల సభ జరుగుతోంది. ప్రతినిధుల సభను సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, జస్టిస్ చంద్రు ప్రారంభిస్తారు. 25 రాష్ట్రాల నుంచి 720 మంది ప్రతినిధులు సభకు హాజరవుతారు. యుకె, ఐర్లాండ్ ఎస్ఎఫ్ఐ యూనిట్ల నుంచి, జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ యూనియన్, ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్, పిఎస్ఎఫ్ వంటి అనుబంధ సంఘాల నుంచి 28 మంది ప్రతినిధులు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. క్యూబా, పాలస్తీనా, బంగ్లాదేశ్‌ల కు చెందిన విదేశీ ప్రతినిధులు కూడా మహాసభకు హాజరుకానున్నారు. 13న సభకు ముసాయిదా నివేదికను ప్రధాన కార్యదర్శి సమర్పిస్తారు. 16న నూతన నాయకత్వాన్ని ఎన్నికతో మహాసభ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో యూనిట్ల ఏర్పాటు, ముప్పై మూడేళ్ల తరువాత గుజరాత్లో రాష్ట్ర కమిటీ ఏర్పాడటం, జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి రాష్ట్ర కమిటీ ఏర్పాడటం వంటివి తమ సంఘం సాధించిన ఘనత అని పేర్కొన్నారు. సంయుక్త కార్యదర్శులు దీప్సితా ధర్, దినీత్ డెండా, కార్యవర్గ సభ్యుడు నితీష్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.