Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈబీల విక్రయం
- ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం వెల్లడించిన ఎస్బీఐ
న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్ట్రోరల్ బాండ్ల (ఈబీ) ద్వారా రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయల్లో విరాళాలు వెల్లువలా వచ్చి చేరాయి. దాదాపు రూ. 676 కోట్ల విలువ చేసే ఈబీల అమ్మకం జరగటంతో రాజకీయ పార్టీలు అజ్ఞాత దాతల నుంచి ఈ మొత్తాన్ని విరాళాలుగా అందుకున్నాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే, ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 15 మధ్య జరిగిన 23వ దశ ఈబీ అమ్మకాలలో రాజకీయ పార్టీలు రూ. 676.26 కోట్లను అందుకున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రిటైర్డ్ నేవీ అధికారి లోకేశ్ కె బాత్ర దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ సమాచారాన్ని వెల్లడించింది.
దీని ప్రకారం.. న్యూఢిల్లీలోని ఎస్బీఐ ప్రధాన శాఖలో వివిధ రాజకీయ పార్టీలు దాదాపు రూ. 660 కోట్ల విలువ చేసే ఈబీలను నగదుగా మార్చుకున్నాయి. ఈ మొత్తం.. ఈ దశలో జరిగిన ఈబీల విక్రయాలలో 97.63 శాతం కావటం గమనార్హం. ఇదే సమయంలో, ముంబయి ప్రధాన శాఖలో రూ. 309.45 కోట్ల విలువ చేసే ఈబీల అమ్మకాలు జరిగాయి. అలాగే, న్యూఢిల్లీ శాఖ దాదాపు రూ. 222.40 కోట్ల విలువ చేసే ఈబీలను విక్రయించింది. దీంతో 2018లో ఈబీ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ పార్టీలకు వాటి ద్వారా అందిన విరాళాల మొత్తం రూ. 11,467 కోట్లకు పెరగటం గమనార్హం. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 10 మధ్య 22వ దశ ఈబీల అమ్మకాల ద్వారా అజ్ఞాత దాతలు రూ. 545 కోట్లను రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చారు. గత రెండు నెలల్లోనే రాజకీయ పార్టీలు రూ. 1221 కోట్లను అందుకున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగిన ఈబీల అమ్మకాలలో దాదాపు రూ. 389.50 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలుగా వచ్చి చేరటం గమనార్హం.నవంబర్లో అమ్మకం జరిగిన 666 ఈబీలు రూ. కోటి విలువ కలిగినవి కావటం కావటం గమనార్హం. అయితే, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు నగదును సమకూర్చినట్టు దీనిని బట్టి అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కాగా, 24వ దశ ఈబీ ల అమ్మకం గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రెండో దశ జరుగుతున్న సందర్భంలో ఈనెల 3న ప్రారంభమైంది. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ కింద నమోదైన రాజకీయ పార్టీలు, లోక్సభ, శాసన సభలకు జరిగిన గత సాధారణ ఎన్నికల్లో ఒక్క శాతానికి తగ్గకుండా ఓట్లను పొందినవి ఈబీలను పొందగలవు. దీనిని అనుమతించే ఆర్థిక చట్టం 2017 నిబంధనలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సవాలు చేయబడింది.