Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైమ్ స్కేల్ పే అమలు చేయాలి
- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ డిమాండ్
- కేంద్రం ఉదాసీన వైఖరిపై
- పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న పిల్లల పోషకాహార లోపాన్ని పరిష్కరించటంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తమ పోరాటాలను ఉధృతం చేయాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) నిర్ణయించింది. వర్కర్లకు, హెల్పర్లకు టైమ్‌స్కేల్ వేతనాలు అమలు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. దేశంలో మహిళలు, శిశు అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులలో తీవ్ర కోత, ఆరు నెలల లోపు శిశువుల మరణాలు పెరుగు తున్నాయని సంస్థ ఎత్తి చూపింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐసీడీఎస్)లో పని చేస్తున్న కార్మికులపై జరుగుతున్న దోపిడీని కార్మికులు, హెల్పర్లు తప్పుబట్టారు.
దేశవ్యాప్తంగా అంగన్వాడీల్లో దాదాపు 13 లక్షల మంది వర్కర్లు, 11 లక్షల మంది హెల్పర్లు, 34 వేల మంది సూపర్వైజర్లు ఉన్నారు. కేంద్రం కార్మికులకు రూ. 4500, హెల్పర్లకు రూ. 2500 చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు జీతం లేదా గౌరవవేతన సహ కారంతో ముందుకు వస్తాయి. డిసెంబరు 6-9 వరకు మధురైలో జరిగిన ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ 10 జాతీయ సదస్సు, ఉద్యోగ క్రమబద్దీకరణ, మెరుగైన పని పరిస్థితులు, పెరుగు తున్న పని భారం, పదవీ విరమణ హక్కులతో సహా ఇతర హక్కులను సాధించుకోవటానికి పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సదస్సును సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రారంభించారు.
అంగన్వాడీల ధ్వంసం
బడ్జెట్ కేటాయింపులు, వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు తగ్గించటం ద్వారా దేశంలోని అంగన్వాడీ లను బీజేపీ సర్కారు నాశనం చేస్తున్నదని ఏఐఎఫ్ ఏడబ్ల్యూహెచ్ ఆరోపించింది. దేశ పిల్లల అవసరా లను కేంద్రం చిన్న చూపు చూస్తున్నదని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధధు సదస్సులో ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పిల్లల కోసం బడ్జెట్ కేటాయింపుల వాటా మొత్తం బడ్జెట్లో దాదాపు 2.35 శాతమే. ఇది గత 11 ఏండ్లలో కనిష్ట స్థాయి కావటం గమనార్హం. '' పిల్లల పౌష్టికాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పోషణ్ అభియాన్, పోషణ్ ట్రాకర్లపై పెద్ద ఎత్తున వాదనలు చేస్తోంది. కానీ, తక్కువ కేటాయింపుల కారణంగా పిల్లలకు పోషకాహారం అందటం లేదు'' అని సింధు చెప్పారు. కార్మికులందరికీ టైమ్‌స్కేల్ రూ. 26వేలు చెల్లించి క్రమబద్ధీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సదస్సు డిమాండ్ చేసింది.
కేంద్రం ప్రతిపాదించిన లేబర్కోడ్లపై సదస్సులో ఒక తీర్మానాన్ని చేశారు. లేబర్కోడ్లో అంగన్వాడీ కార్యకర్తలను కార్మికులుగా గుర్తించటం లేదనీ, కనీసం వేతనాల నిరాకరణ గురించి తీర్మానంలో పేర్కొన్నది. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. కాగా, ఈ సదస్సుకు పలు రాష్ట్ర సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 650 మంది ప్రతినిధులు హారయ్యారు. ర్యాలీ, బహిరంగ సభలో 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా సింధును సమావేశం ఎన్నుకున్నది.