Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులకు ఆమడ దూరంలో ప్రభుత్వ సేవలు
- విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, పౌష్టికాహారం అందుకోవటంలో వివక్ష
- భూముల్ని కోల్పోయి దినసరి కూలి బతుకు : భారత్ రూరల్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ప్రభుత్వ సేవలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయని భారత్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ నివేదిక పేర్కొంది. విద్య, వైద్యం, పోషకాహారం, శుద్ధమైన తాగునీరు, పారిశుద్ధ్య వసతులు మొదలైనవి పొందటంలో గిరిజనులు చాలా వెనుకబడ్డారని, వివక్షకు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. 1947 తర్వాత దేశంలో గిరిజనుల స్థితిగతులపై నిర్వహించిన మొదటి సమగ్ర అధ్యయనమని నివేదికలో పరిశోధకులు ప్రకటించారు. ప్రభుత్వ వర్గాలు, కేస్ స్టడీస్, గిరిజన సంఘాలతో ఇంటర్వ్యూలు, గత పరిశోధనల చరిత్రను కలుపుతూ 'భారత్ రూరల్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్' గణాంకాల్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీయటమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని పరిశోధకులు చెప్పారు.
''ఈ భారీ నివేదిక గిరిజనులు అనుభవించిన చారిత్రాత్మక నిర్లక్ష్యాన్ని గుర్తించింది. అనేక విధాలైన నేపథ్యంతో కూడిన గిరిజనులను ఒక చోటకు తీసుకువచ్చేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది'' అని ఇండియన్ ఎన్జీవో సభ్యుడు ప్రమస్తేష్ అంబస్తా చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభాలో 8శాతం గిరిజనులున్నారని ఒక అంచనా. గత రెండు దశాబ్దాలుగా మైదాన ప్రాంతాల్లోని వారికే ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పరిమితం కావటం, దీనిని దేశాభివృద్ధిగా లెక్కలోకి తీసుకోవటాన్ని పరిశోధకులు తప్పుబడుతున్నారు. ''స్థానిక సమాజాలు సారవంతమైన భూముల్ని, నదీ పరివాహక ప్రాంతాల్ని ఆక్రమించుకున్నాయి. కఠినమైన జీవన పరిస్థితులుండే అడవులు, కొండ ప్రాంతాలకు గిరిజనుల్ని తరిమివేశారు. విద్య, వైద్యం అందుకోలేని పరిస్థితిని ఏర్పరిచారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రభుత్వ సేవలు పొందలేనివిధంగా దశాబ్దాలపాటు వివక్ష కొనసాగుతోంది. అందువల్లే నేడు గిరిజనులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు'' అని నివేదిక తెలిపింది.
భూమి హక్కుల్లో అణచివేత
పట్టణాభివృద్ధి గిరిజనులను తీవ్రంగా ప్రభావితం చేసింది. జీవనోపాధి లేక ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దినసరి కూలిగా పనిచేయాల్సి వస్తోంది. అనేక రంగాల్లో గిరిజన సమాజం అణచివేతకు గురవుతోంది. ప్రభుత్వపరంగా వివక్షను ఎదుర్కొంటోందని క్యాంపెయిన్ ఫర్ సర్వైవల్, డిగ్నిటీ సంస్థ మేనేజర్ శంకర్ గోపాల్కృష్ణన్ అన్నారు. అటవీ భూముల హక్కుల విషయంలో గిరిజన హక్కులు కాలరాస్తున్నారని, పెద్ద ఎత్తున అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది ఆగితేనే నిజమైన అభివృద్ధి, సాధికారత ఏర్పడుతుందన్నారు.
ఆదాయ వనరులు దెబ్బతినటంతో
సాధారణ భూములు, అడవుల్ని గిరిజనులు కోల్పోవటం వల్ల స్థిరమైన నివాసం లేకుండా పోతోంది. దీంతో ఈ వర్గాల సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. మైదాన ప్రాంతాలకు వచ్చి అటవీ ఉత్పత్తుల్ని అమ్ముకోవటం, పనిచేయటం ఆగిపోయింది. ఇదంతా కూడా గిరిజన మహిళలపై తీవ్రంగా ప్రభావితం చేసింది. వారిలో, వారి పిల్లల్లో పోషకాహార లోపాన్ని పెంచిందని అంబేద్కర్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దీపా సిన్హా చెప్పారు.