Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల దినోత్సం సందర్భంగా రాష్ట్రపతి ఉద్బోధ
న్యూఢిల్లీ : భీకరమైన వాతావరణ మార్పులు మన తలుపు తడుతున్నాయని, పేద దేశాల్లోని ప్రజలు ఈ పర్యావరణ క్షీణతకు భయంకరమైన మూల్యం చెల్లిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పర్యావరణానికి సంబంధించి న్యాయమైన కోణాన్ని ఈ సమాజం పరిశీలించాల్సి వుందని ఆమె పేర్కొన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రకృతిని, ఈ జీవ వైవిధ్యతను ఎలా గౌరవించాలో, దానితో ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకోవాల్సి వుందని ఆమె కోరారు. ఒకవేళ జంతువులు, వృక్షాలకు మాటలు వస్తే అవి మనతో ఏం మాట్లాడతాయా అని ఆలోచన వస్తూ వుంటుందని అన్నారు. 'మానవ చరిత్ర గురించి నదులు ఏం మాట్లాడతాయి? తమ హక్కుల గురించి మన పశువులు ఏం చెబుతాయి, ఎందుకంటే సుదీర్ఘ కాలంగా మనం వాటి హక్కు లను కాలరాస్తున్నాం. ఇప్పుడు ఆ ఫలితాలన్నీ మన కళ్ల ముందు కనిపిస్తు న్నాయని' ఆమె వ్యాఖ్యానించారు. 'ప్రతి ఒక్క మనిషి సమానమే, ఎలాంటి తేడా లేదని మానవ హక్కుల భావన ఈ సమాజానికి ఉద్బోధిస్తోంది. జన జీవనంతో నిండిన ఈ ప్రపంచాన్ని, మనం గౌరవ ప్రపత్తులతో చూడాలి. ఇదేమీ నైతిక విధి కాదు, మన మనుగడ కోసం మనందరం గుర్తుంచుకోవాల్సిన అమూల్యమైన అంశమిదని' రాష్ట్రపతి స్పష్టం చేశారు. ''అందరికీ గౌరవం, స్వేచ్ఛ, న్యాయం'' అన్నది ఈ ఏడాది మానవ హక్కుల దినోత్సవం ప్రధాన అంశంగా వుందని, భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ఆదర్శాలకు ఇవి చాలా దగ్గరగా వున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.