Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికక్కడ ఘన స్వాగతాలు
న్యూఢిల్లీ :పోరాటం, సంఘటితం, ప్రత్యామ్నాయంతో ముందుకు అనే సందేశాన్ని ప్రచారం చేస్తూ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యాన అమర వీరుల జ్యోతి యాత్రలు పలు రాష్ట్రాల మీదుగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఎఐకెఎస్ 35వ అఖిల భారత మహాసభ ఈనెల 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో వరుసగా తెలంగాణ, తమిళనాడులో ప్రారంభించిన రెండు అమరవీరుల జ్యోతి యాత్రలు (షహీద్ జ్యోతి యాత్రలు) ఈ నెల 8వ తేదీ రాత్రి సేలం చేరుకున్నాయి. సేలం జైలులో కిసాన్ ఉద్యమ నాయకులైన 22 మంది కమ్యూనిస్టులను 1950 ఫిబ్రవరి 11న పోలీసులు కాల్చి చంపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వేదిక, తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గ్రామమైన కడవెండి నుంచి తొలి అమరవీరుల జ్యోతి యాత్ర బయలుదేరింది. ఏఐకేఎస్ నాయకులు పి.కృష్ణ ప్రసాద్ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ యాత్రను ఏఐకేఎస్ ఉపాధ్యాయుడు ఎస్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ యాత్ర ఇప్పటివరకు గుండ్రాంపల్లి, మిరియాల్గూడ (నల్గొండ), గజరాం పల్లి (అనంతపూర్), పంపిడి, హోసూరు, బాగేపల్లి దాటి సేలం చేరుకుంది.
రెండో అమరవీరుల జ్యోతి యాత్ర తమిళనాడులోని కీజ్వెన్మణి నుంచి ప్రారంభమైంది. న్యాయమైన వేతనం, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు అగ్రకుల భూస్వాములు, వారి గూండాలు 44 మంది వ్యవసాయ కూలీలను ఊచకోత కోశారు. ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ యాత్రను ఎఐకెఎస్ మాజీ అధ్యక్షుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమనేత ఎన్ శంకరయ్య 101 ఏళ్ల వయసులో ప్రారంభించారు. కార్మిక, కర్షక ఐక్యత బలోపేతం కావాలని, ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర ఇప్పటివరకు తిరుతురైపూండి, గంధర్వక్కోట్టై, తంజావూరు, ఉలుందూర్పేట, తిరుచ్చి, కళ్లకురిచ్చి దాటి సేలం వద్ద కలుస్తుంది.
ఈ రెండు యాత్రలకు ఎక్కడికక్కడ రైతులు, కార్మికులు, ప్రజానీకం ఉత్సాహంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ నెల 6న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రెండు యాత్రల్లోనూ ఆయనకు నివాళులర్పించారు. సేలంలో కార్ల్ మార్క్స్ విగ్రహానికి సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తమిళనాడు వివాసాయిగల్ సంఘం ఉపాధ్యక్షుడు డి రవీంద్రన్ నాయకత్వంలో సేలం వద్దకు మూడో అమరవీరుల జ్యోతి చేరింది. కేరళ కర్షక సంఘం అధ్యక్షుడు విజరు కుమార్ నాయకత్వంలోని పున్నప్ర-వాయలార్ నుంచి ఫ్లాగ్ మార్చ్ ఈ నెల 9న ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రామచంద్రన్ పిళ్లై ప్రారంభించారు. సమాంతరంగా, కేరళ కర్షక సంఘం కార్యదర్శి పనోలి వల్సన్ నాయకత్వంలో కయ్యూరు నుండి ఫ్లాగ్ పోల్ (జెండా స్తంభం) మార్చ్ ప్రారంభించారు. దీన్ని ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి ఇపి జయరాజన్ ప్రారంభించారు. పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే మూడు జ్యోతులు, జెండా, ఫోల్ మార్చ్‌లు కేరళకు చేరుకున్నాయి. కేరళలోని వివిధ ప్రాంతాల మీదుగా మంగళవారం ఎఐకెఎస్ 35వ అఖిల భారత మహాసభకు ఆతిథ్యం ఇవ్వనున్న త్రిసూర్‌కు చేరుకుంటాయి.