Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌కు బలమున్న సౌరాష్ట్రలో దెబ్బకొట్టిన ఆప్
- ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి..బీజేపీకి భారీగా స్థానాలు
న్యూఢిల్లీ : గుజరాత్లో బీజేపీ విజయం ఊహించినదే. ప్రధాన ప్రతిపక్షం బలంగా లేకపోవటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చీలటం బీజేపీకి బాగా కలిసివచ్చిం ది. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ్నుంచి వస్తున్న వార్తా కథనాలు, విశ్లేషణలు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను తీవ్రంగా నిరాశపర్చింది. ఇకపై జరగాల్సి ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోషించే పాత్ర..కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత అసెంబ్లీ (2017) ఎన్నికలతో పోల్చితే బీజేపీకి 3శాతం ఓటింగ్ (49 నుంచి 52) పెరిగింది. గెలుపు స్థానాల్ని అమాంతం 57 పెంచింది. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న సౌరాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్ ఓట్లను ఆప్ భారీగా కొల్లగొట్టడమే ఈ ఫలితానికి ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఆప్ ఓటింగ్ 20శాతం దాటింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరునుబట్టి ప్రధానమైన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అందరూ ఊహించారు. ఆప్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి గానీ, ఈస్థాయిలో బీజేపీ గెలుపునకు కారణమవుతుందని అనుకోలేదు. పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలో ఆప్..కాంగ్రెస్‌ను దెబ్బకొడుతోంది. తొలుత ఢిల్లీలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేసింది. ఆ తర్వాత పంజాబ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు గుజరాత్లో తొలి ప్రయత్నంలోనే ప్రతిపక్ష స్థానానికి చేరుకుంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించటం ఆప్‌కు బాగా కలిసివచ్చింది. గుజరాత్‌లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుందని, ఇది తమకు కలిసివస్తుందని అమిత్ షా అంచనావేశారు. ఇక్కడ సాధించిన ఓటింగ్, జాతీయ పార్టీగా గుర్తింపు అందుకోవటం పట్ల కేజ్రీవాల్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బలహీనపర్చడమే లక్ష్యంగా అమిత్ షా, ప్రధాని మోడీ ఎత్తుగడలు ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించటంలో బీజేపీకి ఆప్ ఇస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ ఎన్నికలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆప్ పోషించే పాత్ర కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పోటీదారులు బీజేపీ, కాంగ్రెస్‌లే.