Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా రవాణాలో మహిళలకు తప్పని ఇబ్బందులు
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది వారే
- బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణం
- భారత్‌లోని పరిస్థితిపై ప్రపంచబ్యాంకు నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళలు ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పురుషులతో పోల్చుకుంటే వారు ఈ రవాణాను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజా రవాణాలో వారికి ఎదురవుతున్న సౌకర్యాల కొరత ఇబ్బందులకు గురి చేస్తున్నది. భారత్‌లో 'జెండర్ రెస్పాన్సివ్ అర్బన్ మొబిలిటీ అండ్ పబ్లిక్ స్పేస్'కు సంబందించి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మహిళల ప్రయాణ అవసరాలను మరింత కలుపుకొని ప్రజా రవాణాను ఎలా రూపొందించాలనే దానిపై భారతీయ నగరాలకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో రూపొందించబడింది.
ఈ నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఎక్కువగా ఉపయోగించేవారిలో మహిళలు ఉన్నారు. పురుషులు, మహిళలు ప్రయాణించే విధానం కూడా అంతర్గతంగా భిన్నంగా ఉంటుంది.
నివేదికలోని అంశాలు
- మహిళల ప్రయాణాల్లో 84 శాతం ప్రజా రవాణా ద్వారానే జరుగుతున్నాయి
- పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు పనికి నడవటానికి మొగ్గు చూపుతున్నారు. పురుషుల్లో ఈ సంఖ్య 27.4 శాతం ఉండగా, మహిళల్లో ఇది 45.4 శాతంగా ఉన్నది.
- ఎక్కువ మంది మహిళలు బస్సులో ప్రయా ణిస్తుంటారు. ప్రయాణించేటప్పుడు స్తోమతను పరిగణలోకి తీసుకునే అవకాశమున్నది. వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు ఖరీదైనవి కాబట్టి వారు తరచుగా నెమ్మదిగా ఉండే రవాణా మార్గాలను ఎంచుకుంటారు.
- వీధి దీపాల కొరత, చివరి మైలు వరకు నమ్మదగిన రవాణా లేకపోవటం, మారు మూల ప్రాంతాల్లోని బస్ స్టాప్‌లలో ఎక్కువ వెయిటింగ్ టైమ్ వంటివి ఈ విషయంలో కొన్ని సవాళ్లు.
ముంబయిలోని 6,048 మంది అభిప్రాయాలతో 2019 ప్రపంచ బ్యాంకు మద్దతుతో చేసిన సర్వేకు ప్రతిస్పందనగా ఈ టూల్‌కిట్ రూపొందించబడింది. ఈసర్వేలో 2004 నుంచి 2019 మధ్య కాలంలో పురుషులు పనికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనాలకు మారారని తేలింది. అయితే, మహిళలు ఆటో-రిక్షాలు లేదా ట్యాక్సీలను ఉపయోగించారనీ, ఇవి ద్విచక్ర వాహనాల కంటే (ప్రయాణానికి) ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని వెల్లడైంది.
నివేదిక సూచనలు
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ప్రజా రవాణా సేవలు మహిళల భద్రత, వారి నిర్దిష్ట ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడలేదు. ఇది మహిళలకు సంబంధించిన పని, విద్య, ఇతర అవసరాలపై ప్రభావం చూపింది. 2019-20లో 22.8 శాతంతో ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప మహిళా కార్మిక భాగస్వామ్య రేటును కలిగి ఉండటం గమనార్హం. వీధి దీపాలు, కాలి నడకకు సౌకర్యాలు, సైక్లింగ్ ట్రాక్‌లు వంటివి పలు అంశాలను నివేదిక సిఫారసు చేసిన అంశాల్లో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ద్విచక్ర వాహనం లేని, ప్రజా రవాణా సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించే మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయని వివరించింది. తక్కువ ధరల పాలసీలను రూపొందించటం ద్వారా మహిళల రైడర్‌షిప్‌ను పెంచవచ్చని నివేదిక పేర్కొన్నది. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులను వేగంగా ట్రాక్ చేయటంలో సహాయపడుతుంది.