Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
- అందులో 26 మంది బీజేపీ వారే..!
- ఒకరు లైంగికదాడి కేసులో నిందితుడు : ఏడీఆర్
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా (26మంది) బీజేపీ ప్రజాప్రతినిధులే ఉండటం విశేషం. లైంగికదాడి కేసులో ఒక బిజెపి ఎమ్మెల్యే నిందితుడుగా ఉన్నాడు. వేధింపుల కేసులో కాంగ్రెస్, ఆప్, బీజేపీలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే నిందితులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో క్రిమినల్ కేసుల్లో నిందితుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వివరించింది. ఏడీఆర్, గుజరాత్ ఎలక్షన్ వాచ్ మొత్తం 182 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించాయి.
ఈ నివేదిక ప్రకారం.. కొత్తగా ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ 40 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది సభ్యులకు (మొత్తం 182 మందిలో 16 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉంది. వీరిలో హత్యాయత్నం, లైంగికదాడి వంటి తీవ్ర ఆరోపణలు ఉన్న వారు ఉన్నారు. ఈ 29 మందిలో 20 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇద్దరు స్వతంత్రులు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు ఉన్నారు.
26 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 156, కాంగ్రెస్ 17, ఆప్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఎడిఆర్ అధ్యయనం ప్రకారం.. 156 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 26 మంది (17 శాతం), కాంగ్రెస్కు 17 మందిలో 9 (53 శాతం), ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు (40 శాతం), 3 మంది స్వతంత్రులు (68 శాతం) క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. తనపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నదని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే కంధాల్ జడేజా ప్రకటించారు. 2017లో 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండటం గమనార్హం.
ముగ్గురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం ఆరోపణలు
ఐపీసీ సెక్షన్ 307 (హత్యా ప్రయత్నం) కింద కేసులు ఎదుర్కొంటున్నట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశదా అనంత్ పటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పటాన్ కిరీట్ పటేల్ , బీజేపీ ఎమ్మెల్యే ఉనా కాళూభారు రాథోడ్ ఉన్నారు.
మహిళలకు సంబంధించిన నేరాల్లో..
ఐపీసీ సెక్షన్ 354 (మహిళలను అవమానించడం / వేధించడం) లేదా సెక్షన్ 376 (లైంగికదాడి) కింద నలుగురు ఎమ్మెల్యేలు కేసుల్లో ప్రమేయం ఉన్నారని కూడా అధ్యయనం వెల్లడించింది. ఈ నలుగురిలో బిజెపికి చెందిన జేథా భర్వాద్పై లైంగికదాడి ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీ, బీజేపీ ఎమ్మెల్యే జనక్ తలావియా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవలపై ఐపీసీ సెక్షన్ 354 కింద అభియోగాలు నమోదై ఉన్నాయి.