Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయమంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దీపాంకర్ దత్తాకు ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా పదోన్నతి విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొలిజియం సిఫార్సులను వ్యతిరేకిస్తూ తరచూ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా జత కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నియామకం జరగడం గమనార్హం. జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం తరువాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరుకుంటుంది. సుప్రీంకోర్టుకు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34కు చేరింది. 1965 ఫిబ్రవరి 9న జన్మించిన దీపాంకర్ దత్తా 2030 ఫిబ్రవరి 8 వరకూ ఆ బాధ్యతల్లో ఉంటారు. 'భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లోని క్లాజ్ (2) ద్వారా లభించిన అధికారాలను అమలు చేస్తూ, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు.ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలులోకి వస్తుంది' అని నోటిఫికేషన్లో న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును గత ఏడాది సెప్టెంబర్‌లో జస్టిస్ యుయు లలిత్ (ప్రస్తుతం రిటైర్ అయ్యారు) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన మరొక నోటిఫికేషన్లో బాంబే హైకోర్టు తాతాల్కిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజరు విజరుకుమార్ గంగా పూర్వాలా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. జస్టిస్ దత్తా 2006 జూన్ 22న కోల్కత్తా హైకోర్టు బెంచ్‌కు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కోల్కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కుమారుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రారుకు బావ జస్టిస్ దీపాంకర్ దత్తా.