Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కత్తులతో దాడి చేసిన కేంద్ర మంత్రి కుమారుడి అనుచరులు
లక్నో: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు ఈ కేసులోని సాక్షులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడి నుంచి ఒక వ్యక్తి తప్పించుకోగా మరో వ్యక్తి గాయపడ్డాడు. గత ఏడాది అక్టోబర్ 3న కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా, అతడి అనుచరులు లఖింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపైకి వాహనాలు నడిపి తొక్కించి చంపారు.
ఈ సంఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. అనంతరం జరిగిన అల్లర్లలో కొందరు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. సుప్రీంకోర్టు చీవాట్లతో దిగివచ్చిన యూపీ పోలీసులు చివరకు గత ఏడాది డిసెంబర్ 6న ఆశిష్ మిశ్రా, అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులైన ప్రబ్జ్యోత్ సింగ్, అతడి తమ్ముడు సర్వజీత్ సింగ్ ఒక వేడుకకు వెళ్తుండగా కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు కత్తులతో దాడి చేశారు. ప్రబ్జ్యోత్ సింగ్ సురక్షితంగా బయటపడగా సర్వజీత్ సింగ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, తమపై జరిగిన దాడిపై పోలీసులకు ప్రబ్జ్యోత్ సింగ్ ఫిర్యాదు చేశాడు.