Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోటల్స్, రెస్టారెంట్లలో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి : సీజేఐ డివై చంద్రచూడ్‌కు పొత్తూరి భారతి ఫౌండేషన్ వినతి
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని హోటల్స్, రెస్టారెంట్లలో డయాబెటిస్ ఫ్రెండ్లీ ఫుడ్ (మధుమేహం రోగులకు ఉపయోగపడే ఆహారం) అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు పొత్తూరి భారతి ఫౌండేషన్ చైర్మెన్, సుప్రీం కోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీజేఐ డివై చంద్రచూడ్‌కు ఆయన మూడు పేజీల వినతి పత్రం అందజేశారు. దేశంలో 2019 నాటికి 77 మిలియన్ల ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారనీ, 2045 నాటికి ఈ సంఖ్య 134 మిలియన్లకు పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ప్రతి వంద మందిలో 15 మంది మధుమేహం రోగులు ఉన్నారని, చిన్నారుల నుంచి వృద్ధాప్యం వరకు అందరూ వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో మధుమేహం బాధితులకు ఉపయోగపడేలా 10 నుంచి 15 శాతం ఆహారం అందుబాటులో తీసుకురావాలని కోరారు. అందుకనుగుణంగా ఆయా హోటల్స్, రెస్టారెంట్లకు లైసెన్స్‌లు ఇచ్చినప్పుడు ఈ నిబంధన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఉన్న క్యాంటీన్లలో కూడా మధుమేహం రోగుల సౌకర్యార్థం డయాబెటిస్ ఫ్రెండ్లీ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రికి కూడా వినతి పత్రం సమర్పించామనీ, అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కనుక ఈ సమస్యను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌ను కోరారు.