Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విసవదర్ ఎమ్మెల్యే చేరిక ఖరారు!
అహ్మదాబాద్ : ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. గుజరాత్లో ఆప్ తరపున ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరిలో జునాగఢ్ జిల్లా విసవదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపత్ భయాని బిజెపిలో చేరడం ఖాయమని సమాచారం. ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలిసింది. మిగిలిన ఆప్ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ లో చేరతానని వస్తున్న వార్తలు భూపత్ భయాని ఖండించారు. బీజేపీ లో చేరే విషయంపై ప్రజల అభిప్రాయం తీసుకుంటానని తెలిపారు. ఆదివారం రాత్రి ఒక మీడియా సంస్థతో భూపత్ భయాని మాట్లాడుతూ 'నేను బీజేపీ లో చేరడం లేదు. బీజేపీ లో చేరాలా.. వద్దా.. అని ప్రజలను అడుగుతాను' అని తెలిపారు. తక్కువమంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం బలహీనంగా మారిందని, ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చుని తనకు ఓటు వేసిన ప్రజలకు ఏమీ చేయలేనని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వారి సమస్యలు పరిష్కారించాల్సి ఉందని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ప్రశ్నించగా భయాని తోసిపుచ్చారు. 'భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజల కోసం పనిచేయడం నా హక్కు' అని చెప్పారు. గుజరాత్లో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులను చేర్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.