Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం
- ఓపీఎస్ సహ పది హామీలు అమలుచేస్తాం.. : సీఎం
సిమ్లా : నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఓ బస్ డ్రైవర్ కుమారుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు (58) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ముకేశ్ అగ్నిహోత్రి (60) బాధ్యతలు చేపట్టారు.. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గంలో 12 మంది ఉండవచ్చునని భావిస్తున్నా, వీరిద్దరూ మినహా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి, నివాళులర్పించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, హిమాచల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, సచిన్ పైలట్, సుఖు కుటుంబసభ్యులు, ఆయన తల్లి, భార్య, కుమార్తెలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 68 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఓపీఎస్ సహా 10 హామీలనూ అమలు చేస్తాం
పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)సహా పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన పది హామీలను అమలు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజలనుద్ధేశించి ఆయన ప్రసంగించారు. పారదర్శకమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యవస్థను, కొత్త ఆలోచనలను అమలులోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేస్తామని చెప్పారు.
సాధారణ కుటుంబం నుంచి సీఎం వరకూ...
వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు సాధారణ కుటుంబం నుంచి ఎదిగారు. సుఖ్వీందర్ సింగ్ తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు ఒకప్పుడు పాలు విక్రయించారు. సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. 1980ల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2000లో స్టేట్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడయ్యారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 2019లో ప్రతిభాసింగ్ బాధ్యతలు చేపట్టే వరకు పిసిసి చీఫ్‌గా పనిచేశారు. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 58 ఏండ్ల సుఖుకు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సతీమణి, పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌ను పక్కనపెట్టి సుఖును కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం గమనార్హం. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించినట్టు ప్రతిభాసింగ్ తెలిపారు.