Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 రాష్ట్ర శాసన సభల్లో 10 శాతం కంటే తక్కువే
- ఇందులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కూడా
- పలు రాష్ట్రాల్లో 15 శాతం కంటే తక్కువ
- లోక్‌సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల శాసన సభలలో మహిళా ప్రాతినిధ్యం ఆందోళన కలిగిస్తున్నది. 19 రాష్ట్ర అసెంబ్లీలలో ఇది పది శాతం కంటే తక్కువగా ఉన్నది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ ఉండటం గమనార్హం. అలాగే, చాలా రాష్ట్రాలలో ఇది 15 శాతం కంటే తక్కువగా నమోదై ఉన్నది. లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన ప్రభుత్వ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ గణాంకాల ప్రకారం.. పది శాతం కంటే తక్కువ మహిళా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ లు ఉన్నాయి. బీహార్ (10.70 శాతం), ఛత్తీస్‌గఢ్ (14.44 శాతం), హర్యానా (10 శాతం), జార్ఖండ్ (12.35 శాతం), పంజాబ్ (11.11 శాతం), రాజస్థాన్ (12 శాతం), ఉత్తరాఖండ్ (11.43 శాతం), యూపీ (11.66 శాతం), పశ్చిమ బెంగాల్ (13.70 శాతం), ఢిల్లీ (11.43 శాతం) రాష్ట్రాలు పదిశాతం కంటే ఎక్కువ మంది మహిళా శాసన సభ్యులు ఉన్న రాష్ట్ర శాసన సభలు.
ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన ప్రతినిధులలో 8.2 శాతం మంది మహిళలు కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి ఒక మహిళ మాత్రమే ఎన్నికయ్యారు. ఇక లోక్‌సభలో మహిళా ఎంపీల వాటా 14.94 శాతం కాగా, రాజ్యసభలో ఇది 14.05 శాతంగా ఉన్నది. దేశవ్యాప్తంగా అసెంబ్లీలలో మహిళా ఎమ్మెల్యేల సగటు సంఖ్య 8 శాతం మాత్రమే కావటం గమనార్హం.
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రాతినిధ్య గురించి లోక్‌సభలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రశ్నను లేవనెత్తారు. వారి మొత్తం ప్రాతినిధ్యాన్ని పెంచటానికి తీసుకున్న చర్యల గురించి కూడా కేంద్రాన్ని అడిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రానికి ఆలోచన ఉన్నదా అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఏకాభిప్రాయం ఆధారంగా జాగ్రత్తగా చర్చించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తున్నది. ప్రతిపక్షాలు సైతం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ సందర్భంగా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యంపై కేంద్రం వెల్లడించిన గణాంకాలు బిల్లు ఆశ్యకతను నొక్కి చెప్తున్నాయని నిపుణులు, మహిళా సంఘాల నాయకులు తెలిపారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడింటా ఒక వంతు సీట్లు కల్పించాలనే ఈ బిల్లును పార్లమెంటులో తొలుత 1996లో ప్రవేశపెట్టారు. 2010లో దీనిని రాజ్యసభ ఆమోదించినప్పటికీ.. 15వ లోక్‌సభ రద్దుతో బిల్లు కూడా రద్దయినట్టయ్యింది.