Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ విధానాల కోసం ఐక్య పోరాటాలు
- సంఘం బలోపేతమే మార్గం : ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపు
- త్రిసూర్‌లో ఉత్తేజ పూరితంగా జాతీయ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కె వరదరాజన్ నగర్ (త్రిసూర్)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, మోడీ ఓడితేనే రైతాంగానికి మనుగడని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. కేంద్రంలో ప్రస్తుతం మతతత్వ, మనువాద, ఆధిపత్య, కార్పొరేట్ల మిళిత ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. అటువంటి ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాల కోసం కలిసొచ్చే లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు రైతులు మద్దతివ్వాలని, అందుకోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు కేరళలోని త్రిసూర్ నగరంలో జరుగుతున్న ఏఐకేఎస్ 35వ ఆలిండియా మహాసభ మంగళవారం ఇక్కడి కె వరదరాజన్ నగర్ (లూలూ ఫంక్షన్ హాలు)లో ఉత్తేజపూరితంగా ప్రారంభమైంది. ఏఐకేఎస్ పతాకాన్ని అధ్యక్షులు అశోక్ ధావలే ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రారంభ సభకు సంఘం జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ అధ్యక్షత వహించారు. అశోక్ ధావలే ప్రారంభోపన్యాసం చేస్తూ ఎనిమిదేండ్ల మోడీ జమానాలో చేపట్టిన విధానాల వలన దేశం అన్ని విధాలా అధోగతిపాలైందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 'ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోయాయి. నిరుద్యోగం, పేదరికం, ఆకలి, ధరలు అన్నీ పెరిగాయి. ప్రజలకు ఉపాధి కరువైంది. జీవనోపాధి, జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. మరో వైపు మోడీ ప్రభుత్వ ఆశీర్వాదాలతో అదానీ, అంబానీ ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలో ఇంకా ఇంకా పైకెక్కుతున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, అన్ని వ్యవస్థలూ దాడులకు గురవుతున్నాయి. దేశం 75వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ గుజరాత్, కేంద్ర ప్రభుత్వాలు కలిసి బిల్కిస్‌బాను కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది రేపిస్టులు, మర్డరిస్టులను విడుదల చేయడం మతతత్వ ఎజెండా అమలును సూచిస్తుంది. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై దాడులు సరేసరి...' అని అన్నారు.
రెండు లక్షల ఆత్మహత్యలు
వ్యవసాయం, రైతు సంక్షోభంలో కూరుకున్నారని, ఇప్పటి వరకు 4 లక్షల రైతు ఆత్మహత్యలు జరగ్గా, బిజెపి వచ్చాక 2 లక్షల రైతు ఆత్మహత్యలు సంభవించాయని అశోక్ ధావలే చెప్పారు. ఇంకా... 'మోడీ సర్కారుకు రైతు అవసరం లేదు. ధాన్యానికి కేరళ వామపక్ష ప్రభుత్వం ఇచ్చినంత మద్దతు ధర, వ్యవసాయ కార్మికులకు వేతనాలు మరెక్కడా లేవన్నారు. వ్యవసాయం, విద్య, హెల్త్‌లో ప్రజానుకూల కార్యక్రమాలు చేపట్టినందునే నాలుగున్నర దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. మన దేశం సహా ప్రపంచంలో మితవాద పార్టీలు అధికారంలోకి రాగా మరోవైపు లాటిన్ అమెరికాలో సోషలిస్టులు, అభ్యుదయవాదులు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు.'అని అన్నారు.
సంఘర్షణ.. సంఘటితం
కార్పొరేటు అనుకూల విధానాల అమలులో మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్లు పరాకాష్ట అని ధావలే గుర్తు చేశారు. 'వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైన నిర్విరామంగా రైతులు బైటాయించడం, విధిలేక మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయడం చరిత్ర. ఆ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలను రైతాంగం తిప్పికొట్టాలి. మద్దతు ధరకు చట్ట బద్ధత, రుణ మాఫీ, విద్యుత్ బిల్లు ఉపసంహరణ కోసం రైతులు ఐక్యంగా ఉద్యమించాలి. రైతు పోరాటాలు ముందుకెళ్లాలంటే ఏఐకేఎస్ బలపడాలి. రైతులను, వ్యవసాయ కార్మికులను సమీకరించి ఇతర వర్గాల ప్రజల సంఘీభావం, మద్దతు కూడగట్టాలి. 2017 అక్టోబర్‌లో ఏఐకేఎస్ 34వ మహాసభ హిస్సార్‌లో జరిగింది. ఐదేండ్లలో ఢిల్లీ ఉద్యమ వెలుగులో సంఘ సభ్యత్వం అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. వచ్చే మూడు నాలుగేళ్లల్లో ఇప్పుడున్న 1.37 కోట్ల నుంచి రెండు కోట్లకు సభ్యత్వాన్ని పెంచి సంఘాన్ని బలోపేతం చేయాలి. ఈ లక్ష్య సాధనకు మహాసభలో చర్చలు జరగాలి...' అని ధావలే దిశానిర్దేశం చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ విజయరాఘవన్ సౌహార్ద సందేశమిస్తూ రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న మోడీ హామీ బ్రోకర్ హామీగా చెప్పారు. ఎంఎస్పీలో దగా, ఉపాధి హామీ నిర్వీర్యం, ప్రయివేటు కంపెనీలకు పంటల బీమా మోడీ ప్రభుత్వ రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాల్లో కొన్ని మాత్రమేనన్నారు. మహాసభ జయప్రదం కావాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపారు. మహాసభ ఆహ్వానసంఘం చైర్మెన్ కె రాధాకృష్ణన్ స్వాగతోపన్యాసం చేశారు. కేరళ అభ్యుదయ, సమరశీల పోరాటాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్నారు. ప్రారంభ సభలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, ఆఫీస్ బేరర్లు వేదికపై ఆశీనులయ్యారు. ఎన్‌కె శుక్లా సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. నివాళిగా సభ మౌనం పాటించింది.
కోలాహలంగా మహాసభ మొదలు
ఎఐకెఎస్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాలు పిక్కటిల్లగా మహాసభ ఉత్తేజభరితంగా ప్రారంభమైంది. అశోక్ ధావలే ఎఐకెఎస్ జెండా ఆవిష్కరించారు. కేరళ సంప్రదాయ కథక్, నృత్యాలు, కళాకారుల పాటలు, రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు, బ్యాండ్, ఆకర్షణగా నిలిచాయి. అమరవీరుల స్థూపం వద్ద నాయకులు, ప్రతినిధులు పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళులర్పించారు. మహాసభ ప్రారంభ సూచకంగా ఎర్ర బెలూన్లు ఎగరేశారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.